Site icon NTV Telugu

Guduru Narayana Reddy : బండి సంజయ్‌కు కేంద్ర భద్రత కల్పించాలి

Guduru Narayana Reddy

Guduru Narayana Reddy

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు కేంద్ర భద్రత కల్పించాలని బీజేపీ సీనియర్‌ నేత గూడూరు నారాయణ రెడ్డి కేంద్రాన్ని కోరారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్‌కు భద్రత కల్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ పోలీసులపై తమకు నమ్మకం పోయిందని, బండి సంజయ్‌కు ప్రాణహాని ఉందని అనుమానం వ్యక్తం చేశారు. సీఆర్పీఎఫ్ సిబ్బందితో రక్షణ కల్పించాలని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి బుల్లెట్ ప్రూఫ్ కారును కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రకు మొదటి నుంచి సమస్యలు సృష్టిస్తున్న టీఆర్‌ఎస్‌, జనగాం జిల్లాలోకి ప్రవేశించిన బండి సంజయ్‌పై టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు దాడి చేశారన్నారు. అమిత్ షా పాదయాత్ర, బహిరంగ సభ విజయవంతమవడాన్ని జనగాం జిల్లా నేతలు జీర్ణించుకోలేక పోతున్నారని, సంజయ్‌ కుమార్‌ పాదయాత్రకు భంగం కలిగించాలని కుట్ర చేశారని ఆయన ఆరోపించారు. ఇటీవల బండి సంజయ్‌పై టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు దాడికి యత్నించారని మండిపడ్డారు.

 

బీజేపీ నేతలను టీఆర్‌ఎస్ నేతలు బెదిరించారని, పాదయాత్ర ప్రశాంతంగా కొనసాగుతున్నా టీఆర్‌ఎస్ నేతలు బీజేపీ నేతలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. పాదయాత్ర ఆపాలని వర్ధన్నపేట ఏసీపీ రమేష్ బండి సంజయ్‌కు నోటీసులు ఇచ్చారని, సంజయ్‌ను అరెస్టు చేసి కరీంనగర్‌కు తరలించడాన్ని తప్పుబట్టి పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చిందని, టీఆర్‌ఎస్‌ రాష్ట్రంలో మతతత్వ మంటలను రాజేస్తూ…తిరిగి బీజేపీని నిందిస్తోందన్నారు. మంచి పంటలు కావాలా మత మంటలు కావాలా ఎంచుకోవాలని సీఎం వ్యాఖ్యలు చేశారని, బీజేపీని మతవాద గ్రూపుగా చిత్రీకరించేందుకు సీఎం ఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తున్నారన్నారు. గడిచిన ఎనిమిదేళ్లుగా హైదరాబాద్‌లో మత ఘర్షణలు లేవని, టీఆర్‌ఎస్‌, ఎంఐఎంల కుట్రలతో నగరంలో ఏ సమయంలోనైనా మతకల్లోలాలు చోటుచేసుకోవచ్చని ఆయన వ్యాఖ్యానించారు.

 

Exit mobile version