టీఆర్ఎస్ పార్టీ నేడు మునుగోడు ప్రజాదీవెన సభ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే.. సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ.. కేంద్రంలోని బీజేపీతో పాటు, కాంగ్రెస్‌పై కూడా విమర్శలు గుప్పించారు. అయితే.. తాజాగా టీఆర్‌ఎస్ సభపై బీజేపీ సీనియర్ నేత గూడూరు నారాయణ రెడ్డి స్పందిస్తూ.. మునుగోడులో టీఆర్ఎస్ ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. మునుగోడులో టీఆర్ఎస్ బహిరంగ సభ అట్టర్ ఫ్లాప్ అయ్యిందని, మునుగోడు ప్రజలతో కేసీఆర్ కు ఎలాంటి అవినాభావ సంబంధం లేదన్నారు గూడూరు నారాయణ రెడ్డి. మునుగోడు సభలో జనాన్ని ఆకర్షించడంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని, చప్పగా సీఎం కేసీఆర్ ప్రసంగం సాగిందన్నారు. ముఖ్యమంత్రి ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా…. స్పందన కరవైందని, వేదికపై నాయకులు చప్పట్లు కొట్టాలని ప్రేరేపించినా స్పందన లేదన్నారు గూడూరు నారాయణ రెడ్డి.
సీఎం తన వెంట హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి సుమారు 20 వేల మందిని తీసుకొచ్చారని, హైదరాబాద్ నుంచి సీఎం కాన్వాయ్ వెంట దాదాపు 4000 వాహనాలు వెళ్లాయన్నారు. సీఎం పరుష పదజాలంతో అమిత్ షా ని అవమానించారని, కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాపై ఎనిమిదేళ్లుగా ఏం చేస్తున్నారో చెప్పాలి సీఎం. తెలంగాణ-ఏపీల మధ్య కృష్ణా జలాల కేటాయింపు ఒప్పందంపై తాను సంతకం చేసిన విషయం సీఎంకి గుర్తు లేదా. ఇప్పుడు మునుగోడు ఎన్నికలు అనగానే కృష్ణా జలాల అంశం గుర్తు వచ్చిందా.. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఎనిమిదేళ్లుగా సీఎం ఎందుకు పట్టించుకోలేదు.. కాళేశ్వరం ప్రాజెక్టు విఫలంతో ఆ వాదన అబద్ధమని రుజువైందన్నారు గూడూరు నారాయణ రెడ్డి.
