దేశంలోని కోట్లాది మంది యువతీ యువకులంతా నరేంద్ర మోడీకి అండగా నిలిచారని చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. శంషాబాద్ లోని వైఎన్ఆర్ గార్డెన్స్ లో జరిగిన భారతీయ జనతా పార్టీ యువ మోర్చా, యువ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. గత పదేళ్ల కాలంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ ఎంతో మంది యువతీ, యువకులకు ఉపాధి మార్గాలు చూపిందన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు, ముద్రా లోన్స్ ద్వారా స్వయం ఉపాధి శక్తిని పెంపొందించిందన్నారు. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాల పట్ల యువతకు మార్గనిర్దేశం చేసిన పార్టీ బీజేపీ మాత్రమేనని తెలిపారు.
Read Also: Earthquake: జపాన్‌లో 6.5 తీవ్రతతో భూకంపం
ఈ సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోడీ సర్కారును ఆ బాసు పాలు చేసేందుకు ప్రతిపక్ష పార్టీలు ఎన్నో కుట్రలు చేస్తున్నాయని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మతతత్వ రాజకీయాలు చేస్తూ బీజేపీపై తప్పుడు ఆరోపణలు చేస్తుందని విమర్శించారు. నరేంద్ర మోడీ పాలనలో దేశ ప్రజలందరినీ కేంద్ర ప్రభుత్వం సమానంగా చూసిందని ఆయన చెప్పారు. దేశంలో ముస్లిం మైనారిటీలను ఆదుకున్న ఘనత నరేంద్ర మోడీ కి దక్కుతుందన్నారు. నరేంద్ర మోడీకి పోటీగా నిలబడ లేకనే రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ కు పారిపోయాడని ఆయన ఎద్దేవా చేశారు. నరేంద్ర మోడీ పిలుపునిచ్చినట్టుగా 400 ఎంపీ స్థానాలు బీజేపీ గెలుచుకోబోతుందన్నారు. ఇక, తెలంగాణ రాష్ట్రంలోనూ బీజేపీ అభ్యర్థులు 12 స్థానాల్లో విజయం సాధించబోతున్నారని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి తన వెంట నాలుగు లక్షల ముస్లిం మైనార్టీ ఓట్లు ఉన్నాయని సంబరపడుతున్నాడు.. కానీ, ఆయనకు యువకులంతా తగిన బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా విశ్వేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు.
Read Also: Ramam Raghavam: ధనరాజ్ డైరెక్టర్గా “రామం రాఘవం”.. ఆసక్తి రేకెత్తిస్తున్న టీజర్
అలాగే, శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని హోటల్ దస్ పల్లలో బీజేపీ నిర్వహించిన సమావేశంలో కొండా సంగీతా రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండా సంగీతా రెడ్డి మాట్లాడుతూ.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి నిత్యం ప్రజలందరికీ అందుబాటులో ఉండే నాయకుడన్నారు. చేవెళ్ల ప్రాంతంలోని ప్రజలంతా తమ తమ పార్టీలను పక్కన పెట్టి వ్యక్తిగతంగా విశ్వేశ్వర్ రెడ్డికి మద్దతునిస్తున్నారని ఆమె చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్ లోని ప్రజలంతా బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి వెంటే ఉంటారని ఆయన సతీమణి తెలిపారు. మే 13న జరగనున్న ఎన్నికలో అర్బన్ ప్రాంత ఓటర్లు భారీ సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రజలంతా తమ కోసం, తమ పిల్లల భవిష్యత్త్ కోసం నరేంద్ర మోడీని ఎన్నుకోవాలని కొండా సంగీతా రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, మేధావులు, ఐటీ నిపుణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.