బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఈ నెల 19న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది ఈడీ. వ్యాపార లావాదేవీలపై ఈడీ అధికారులు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని విచారించనున్నట్లు తెలుస్తోంది. 2014 నుంచి జరిపిన ఆర్థిక లావాదేవీలు, కంపెనీల వ్యవహారాలపై ఈడీ రోహిత్ రెడ్డిని ఈడీ ప్రశ్నించనున్నట్లు సమాచారం. తనకు ఈడీ నోటీసులు వచ్చాయని, విచారణకు హాజరవుతానని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తెలిపారు. అయితే.. కక్షసాధింపు చర్యలో భాగంగానే కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులకు బీజేపీ పాల్పడుతోందని బీఆర్‌ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు. బీఆర్‌ఎస్ నేతలపై వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కౌంటర్ ఇచ్చారు.
Also Read : Sajjala Ramakrishna Reddy: గడప గడపకు కార్యక్రమం ప్రజల దగ్గరకు వెళ్లడమే..
కక్ష సాధింపు కేసీఆర్‌కు ఆయన కుటుంబానికి అలవాటు అని ఆమె విమర్శించారు. ఫాంహౌస్ కేసులో ఏం లేదని అందరికీ అర్థమైందని, అది దొంగ కేసు అని ఆమె వ్యాఖ్యానించారు. డ్రగ్స్ కేసులో నోటీసులు ఇస్తే బీజేపీకి ఏం సంబంధం అని ఆమె అన్నారు. ఆ కేసు ఇప్పటికే నడుస్తోందని, కొత్తగా ఓపెన్ చేసింది కాదని ఆమె అన్నారు. గతంలో కొన్ని రోజుల పాటు మీడియాలో ఇవే వార్తలు నడిచాయని, ఊరికే ఎందుకు నోటీసులు వస్తాయి… వారు తప్పు చేయకుంటే భయమెందుకు అని ఆమె ప్రశ్నించారు. కవితపై ఆరోపణలు వచ్చక ఫాంహౌస్ నాటకాలు బయటికి వచ్చాయని, ఎంతో మంది ఎమ్మెల్యేలను ఇబ్బంది పెట్టి టీఆర్‌ఎస్ లో చేర్చుకున్నారన్నారు. బీఆర్‌ఎస్ పేరుతో కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని ఆమె అన్నారు. 4 గురు ఎమ్మెల్యేలు ఆణిముత్యాలు అయితే ప్రగతి భవన్ నుంచి ఎందుకు బయటికి రానివ్వలేదని, అవినీతిని అంతం చేయడం మోడీ పని.. అవినీతి పరులా నీతి పరులా అనేది బయటికి వస్తది కదా అని ఆమె అన్నారు. అవినీతి ఎక్కడ ఉంటే ఈడీ అక్కడకి వస్తుందని ఆమె ఉద్ఘాటించారు.
