NTV Telugu Site icon

BJP: ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమ్మాకొట్టడంపై బీజేపీ విమర్శ

Delhi Cm

Delhi Cm

ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ ముచ్చటగా ఐదోసారి ఈడీ విచారణకు డుమ్మాకొట్టారు. గతంలో నాలుగు సార్లు విచారణకు దూరంగా ఉన్నారు. తాజాగా శుక్రవారం కూడా ఆయన విచారణకు హాజరుకాలేదు. లిక్కర్ స్కామ్‌లో సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ విచారణకు పిలిచింది. కానీ వరుసగా ఐదోసారి కూడా ఆయన విచారణకు హాజరు కాలేదు. దీంతో కేజ్రీవాల్‌పై బీజేపీ విమర్శలు గుప్పించింది.

లిక్కర్ స్కామ్‌లో తనకేమీ సంబంధం లేనట్టుగా.. ఒక నిస్సహాయుడిగా కేజ్రీవాల్ చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ నేత హరీష్ ఖురానా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఒకవేళ ఈడీ సమన్లు చట్ట విరుద్ధమైతే కోర్టుకు ఎందుకు వెళ్లడం లేదని నిలదీశారు. ఉద్దేశపూర్వకంగా ఈడీ నోటీసులు ఇస్తుంటే.. కోర్టుకెళ్లి ఎందుకు కొట్టివేయించుకోవడం లేదని హరీష్ ఖురానా ప్రశ్నించారు.

ఈడీ నోటీసులపై గతంలో కేజ్రీవాల్ స్పందిస్తూ.. ఈడీ సమన్లు చట్ట విరుద్ధమని కొట్టిపారేశారు. బీజేపీ ప్రేరేపితంతో ఈడీ నోటీసులు ఇస్తుందని కేజ్రీవాల్ ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికల ముందు ఈడీ ద్వారా ఇబ్బంది పెట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోందని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.

లిక్కర్ స్కామ్‌లో నాలుగు సార్లు నోటీసులు ఇచ్చింది. గత నవంబర్ 2న, ఆ తర్వాత డిసెంబర్ 21, జనవరి 3, జనవరి 13న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు ఇచ్చింది. మరోసారి శుక్రవారం (2, ఫిబ్రవరి) విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొంది. కానీ ఐదోసారి కూడా కేజ్రీవాల్ డుమ్మాకొట్టారు.

లిక్కర్ కేసులో గత ఏప్రిల్‌లో దాదాపు 9 గంటల పాటు సీబీఐ కేజ్రీవాల్‌ను విచారించింది. కానీ నిందితుడిగా మాత్రం చేర్చలేదు. కానీ ఇదే కేసులో ఆప్ ముఖ్య నేతలు ఎంపీ సంజయ్‌సింగ్‌, మాజీ మంత్రి మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసింది. గతేడాది ఫిబ్రవరిలో సిసోడియా, అక్టోబర్‌లో సంజయ్‌సింగ్ అరెస్ట్ చేసి జైలుకు పంపించింది. పలుమార్లు బెయిల్ పిటిషన్లు కూడా రద్దు కావడంతో ఇంకా తీహార్ జైల్లోనే ఉన్నారు.

ఇదిలా ఉంటే సార్వత్రిక ఎన్నికల ముందు ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌ను అరెస్ట్ చేసినట్టుగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను కూడా అరెస్ట్ చేసి పార్టీని బలహీనపర్చాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. వరుసగా ఐదోసారి కేజ్రీవాల్ డుమ్మాకొట్టారు. ఈడీ న్యాయస్థానాన్ని ఆశ్రయించి అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏం జరుగుతుందో వేచి చూడాలి.