ఈనెలలో రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తమ అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల నుంచి అభ్యర్థులను ప్రకటించింది. తాజాగా రాజస్థాన్ నుంచి పోటీ చేసే అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. రాజస్థాన్ నుంచి చున్నిలాల్ గరాసియా (Chunnilal Garasiya), మదన్ రాథోడ్‌లను (Madan Rathore) బీజేపీ అభ్యర్థులుగా ప్రకటించింది.
ఈ ఏడాది 68 మంది రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేస్తున్నారు. వీరిలో ముగ్గురు ఎంపీల పదవీకాలం జనవరి 27తో ముగిసింది. మరో 65 మంది సభ్యులు పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఈ 65 మంది సభ్యులలో 55 మంది సభ్యులు ఫిబ్రవరి 23న పదవీ విరమణ చేయనున్నారు. అదే సమయంలో ఏడు మంది రాజ్యసభ ఎంపీల పదవీకాలం ఏప్రిల్ 2-3 మధ్య పూర్తవుతుంది. మే నెలలో మరో ఇద్దరు రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. అత్యధికంగా బీజేపీ ఎంపీలే రిటైర్ అవుతున్నారు. ఈ ఏడాదితో బీజేపీకి చెందిన 32 మంది రాజ్యసభ ఎంపీల పదవీకాలం పూర్తవుతోంది. దీని తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెందిన 11 మంది ఎంపీలు పదవీ విరమణ చేయనున్నారు.
ఇదిలా ఉంటే బీజేపీ ఆయా రాష్ట్రాల్లో రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటిస్తోంది. కానీ కాంగ్రెస్ మాత్రం ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. త్వరలోనే అభ్యర్థులను ప్రకటిస్తామని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే ఈసారి సోనియా రాజస్థాన్ నుంచి రాజ్యసభకు పోటీ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది.
రాజ్యసభ ఎన్నికలకు గత జనవరి 29న ఎన్నికల కమిషన్ ప్రకటించింది. వివిధ రాష్ట్రాల్లోని 56 రాజ్యసభ స్థానాలకు ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది. అదే రోజు కౌంటింగ్ కూడా జరుగుతుంది. ఫిబ్రవరి 15వ తేదీతో నామినేషన్ల దాఖలు గడువు ముగియనుండగా, ఫిబ్రవరి 16న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ఫిబ్రవరి 20తో ముగుస్తుంది. ఫిబ్రవరి 27వ తేదీ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకూ పోలింగ్ జరిపి.. 5 గంటలకు లెక్కింపు ప్రారంభిస్తారు.
BJP announces Chunnilal Garasiya and Madan Rathore from Rajasthan as its candidates for the Rajya Sabha Biennial elections pic.twitter.com/DZSvYmoE1n
— ANI (@ANI) February 12, 2024