NTV Telugu Site icon

Himanta Biswa Sarma: ముస్లిం పురుషులకు బహుళ భార్యలు ఉండడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోంది..

Himanta Biswa Sarma

Himanta Biswa Sarma

Himanta Biswa Sarma: ముస్లిం మహిళలకు న్యాయం చేయడానికి పురుషులు ముగ్గురు-నలుగురు మహిళలను వివాహం చేసుకునే విధానాన్ని మార్చాల్సిన అవసరం ఉందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ గురువారం అన్నారు. ముస్లిం సమాజానికి చెందిన పురుషులు బహుళ భార్యలను కలిగి ఉండడాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తుందని అన్నారు. లోక్‌సభ ఎంపీ బద్రుద్దీన్ అజ్మల్‌పై ఘాటైన దాడిని ప్రారంభించిన శర్మ.. ఏఐయూడీఎఫ్ చీఫ్ నివేదించిన సలహా ప్రకారం మహిళలు “20-25 పిల్లలకు” జన్మనివ్వగలరని, అయితే ఆహారం, బట్టలు, విద్యపై వారి భవిష్యత్తు ఖర్చులన్నీ ప్రతిపక్షాలే భరించాల్సి ఉంటుందని అన్నారు. స్వతంత్ర భారతదేశంలో నివసిస్తున్న పురుషుడు మూడు-నాలుగు మంది స్త్రీలను (గత జీవిత భాగస్వామికి విడాకులు తీసుకోకుండా) వివాహం చేసుకునే హక్కు లేదన్నారు. అలాంటి వ్యవస్థను మార్చాలనుకుంటున్నాని.. ముస్లిం మహిళలకు న్యాయం చేసేందుకు కృషిచేస్తున్నామని ఆయన వెల్లడించారు. అజ్మల్ ఖర్చులు చెల్లించకపోతే, ప్రసవం గురించి ఉపన్యాసాలు చెప్పే హక్కు లేదన్నారు.

మోరిగావ్‌లో జరిగిన బహిరంగ సభలో అస్సాం ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ.. అస్సాంలోని చాలా మంది ఎమ్మెల్యేలు పోమువా ముస్లింలను ఓటు వేయాలని కోరుకుంటున్నారని వెల్లడించారు. కానీ మాకు వారి ఓట్లు అక్కర్లేదని.. మీ పిల్లలను జునాబ్, ఇమామ్‌లుగా చేయవద్దన్న ఆయన.. పిల్లలను డాక్టర్లుగా, ఇంజనీర్లుగా చేయాలని, వారిని మంచి మనుషులుగా మార్చాలని సూచించారు. ‘సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్‌’ని ముందుకు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నామని, మదర్సాలలో చదివి జునాబ్‌గా, ఇమామ్‌గా మారాలని పోమువా ముస్లిం విద్యార్థులు కోరుకోవడం లేదని, వారు పాఠశాలల్లో చదవాలని కోరుకుంటున్నారని ముఖ్యమంత్రి అన్నారు.

Himachal Pradesh CM: హిమాచల్‌ తదుపరి సీఎంపై నేడు కీలక నిర్ణయం.. ఎక్కువ ఛాన్స్‌ వారికే..!

“మాకు ‘సబ్కా సాత్ సబ్కా వికాస్’ కావాలి. అస్సామీ హిందూ కుటుంబాల నుంచి వైద్యులు ఉంటే, ముస్లిం కుటుంబాల నుండి కూడా వైద్యులు ఉండాలి. ‘పోమువా’ ముస్లింల ఓట్లు అవసరం కాబట్టి చాలా మంది ఎమ్మెల్యేలు అలాంటి సలహా ఇవ్వరు” అని శర్మ అన్నారు. తూర్పు బెంగాల్ లేదా ప్రస్తుత బంగ్లాదేశ్ నుంచి వచ్చిన బెంగాలీ మాట్లాడే ముస్లింలను అస్సాంలో ‘పోమువా ముస్లింలు’ అని పిలుస్తారు. మహిళలపై అజ్మల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల గురించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. “అసోంలో, మాకు బద్రుద్దీన్ అజ్మల్ వంటి కొంతమంది నాయకులు ఉన్నారు. సారవంతమైన భూమి కాబట్టి మహిళలు వీలైనంత త్వరగా పిల్లలకు జన్మనివ్వాలని వారు అంటున్నారు. మహిళ ప్రసవ ప్రక్రియను ఒక క్షేత్రంతో పోల్చలేము” అని అన్నారాయన.