ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ కు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ బిగ్ షాక్ ఇచ్చింది. శంషాబాద్‌లోని ఎయిర్‌పోర్ట్ సిటీలో ఉన్న అమెజాన్ గోదాంపై సోదాలు నిర్వహించింది. బిఐఎస్ చట్టం, 2016 నిబంధనలను ఉల్లంఘించినందుకు హైదరాబాద్ శాఖ అధికారులు సోదాలు, సీజ్ ఆపరేషన్ నిర్వహించారు. డైరెక్టర్ & హెడ్ శ్రీ పి వి శ్రీకాంత్ ఆదేశాల మేరకు.. జాయింట్ డైరెక్టర్ రాకేష్ తన్నీరు నేతృత్వంలో, SPO అభిసాయి ఎట్టా డిప్యూటీ డైరెక్టర్ కవిన్ కె, JSA శివాజీలతో కలిసి తనిఖీలు చేపట్టారు.
Also Read:Harsha Vardan : ఆమెతో ఏడేళ్ల లవ్.. అందుకే బ్యాచిలర్ గా ఉండిపోయా : హర్ష వర్ధన్
బీఐఎస్ జరిపిన సోదాల్లో 150 స్మార్ట్ వాచీలు, 15 ఎలక్ట్రిక్ వాటర్ హీటర్లు, 30 CCTV కెమెరాలు, 16 డొమెస్టిక్ ఎలక్ట్రిక్ ఫుడ్ మిక్సర్లు, 10 డొమెస్టిక్ ప్రెజర్ కుక్కర్లు, 1937 స్టెయిన్‌లెస్ స్టీల్ వాటర్ బాటిళ్లు, 326 వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లు, 170 మొబైల్ ఛార్జర్లు, 90 ఎలక్ట్రిక్, నాన్-ఎలక్ట్రిక్ బొమ్మలు మొదలైన వాటితో సహా మొత్తం 2783 ఉత్పత్తులు BIS సర్టిఫికేషన్ లేకుండా స్టోర్ చేసి అమ్మకానికి ఉంచినట్లు గుర్తించారు. ఈ ఉత్పత్తులు భారత ప్రభుత్వం జారీ చేసిన నాణ్యత నియంత్రణ ఉత్తర్వుల (QCOలు) పరిధిలోకి వస్తాయి. BIS స్టాండర్డ్ మార్క్ లేకుండా విక్రయిస్తున్న ఉత్పత్తులను అధికారులు సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న ఉత్పత్తుల విలువ రూ. 50 లక్షలకు పైగా ఉంటుందని అంచనా.
Also Read:MLC Kavitha : దుష్ప్రచారం చేసిన వాళ్లకు కేంద్ర ఇచ్చిన సమాధానం చెంపపెట్టు
BIS చట్టం 2016లోని సెక్షన్ 17 ప్రకారం.. BIS సర్టిఫికేషన్ లేకుండా QCOల కింద కవర్ చేయబడిన వస్తువుల అమ్మకం, నిల్వను నిషేధిస్తుంది. నిబంధనలను ఉల్లంఘిస్తే.. రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా రూ. 2 లక్షల కంటే తక్కువ కాకుండా జరిమానాతో సహా శిక్షను విధించే ఛాన్స్ ఉంటుంది. మొదటి ఉల్లంఘనకు 2 లక్షలు, తదుపరి ఉల్లంఘనలకు రూ. 5 లక్షల వరకు జరిమానా విధిస్తారు.
Also Read:Ugadi Pachadi: ఉగాది పచ్చడిలో పేరుకే ఆరు రుచులు.. లాభాలేమో అనేకం!
ఇప్పటివరకు 769 ఉత్పత్తులకు బీఐఎస్ ప్రమాణాలు పాటించడం తప్పనిసరి చేసింది. తయారీదారులు లేదా రిటైలర్లు నకిలీ వస్తువులను పంపిణీ చేయకుండా.. ప్రజలను తప్పుదారి పట్టించకుండా నిరోధించడానికి, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ తనిఖీలు నిర్వహిస్తోంది. కస్టమర్లు బీఐఎస్ ప్రమాణాలపై అవగాహన కలిగి ఉండాలని అధికారులు సూచించారు. ప్రొడక్టును కొనుగోలు చేసే ముందు, వినియోగదారులు BIS కేర్ యాప్ ద్వారా లైసెన్స్ స్థితిని నిర్ధారించుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే.. BIS CARE యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని కోరారు.