NTV Telugu Site icon

Bilkis Bano Case: బిల్కిస్‌ బానో పిటిషన్‌పై సుప్రీం విచారణ.. కేంద్రం, గుజరాత్‌ సర్కారుకు నోటీసులు

Bilkis Bano Case

Bilkis Bano Case

Bilkis Bano Case: 2002లో గోద్రా రైలు దహనకాండ అనంతరం గుజరాత్‌లో అల్లర్లు జరిగినప్పుడు తనపై అత్యాచారానికి పాల్పడ్డ దోషులను ముందస్తుగా విడుదల చేయడాన్ని సవాల్‌ చేస్తూ బాధితురాలు బిల్కిస్‌ బానో వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. బిల్కిస్​ బానో దోషుల విడుదల కేసులో తమ స్పందన తెలియజేయాలంటూ కేంద్రం, గుజరాత్ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. రెమిషన్​ మంజూరు చేయడానికి సంబంధించిన పత్రాలను ఏప్రిల్​ 18లోగా సిద్ధం చేసుకోవాలని కేంద్రం, గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. బిల్కిస్‌ బానో పిటిషన్‌పై భావోద్వేగాలకు లోబడి తీర్పు ఇవ్వలేమని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ఈ కేసులో సవివరంగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని జస్టిస్‌ కె.ఎం. జోసెఫ్‌, జస్టిస్‌ బి.వి. నాగరత్నతో కూడిన ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది. దోషులకు రెమిషన్‌ను చట్టప్రకారమే మంజూరా చేశారా? అని సుప్రీం ధర్మాసనం ఈ సందర్భంగా ప్రశ్నించింది. దీనిపై తదుపరి విచారణను ఏప్రిల్ 18వ తేదీకి వాయిదా వేసింది.

అత్యాచారం కేసులో దోషులైన 11 మందిని విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ బిల్కిస్​ బానో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. 2002లో జరిగిన గోద్రా అల్లర్ల సమయంలో 5 నెలల గర్భిణిగా ఉన్న బిల్కిస్ బానోపై దుండగులు పాశవికంగా అత్యాచారం చేశారు. అనంతరం ఆమె కుటుంబంలోని ఏడుగురిని హత్య చేశారు. ఈ కేసుపై విచారించిన సీబీఐ ప్రత్యేక కోర్టు.. 2008 జనవరి 21న 11 మందికి జీవిత ఖైదు విధించింది. 15 ఏళ్ల జైలు శిక్ష తర్వాత తమను విడుదల చేయాలంటూ దోషుల్లో ఒకరు సుప్రీంను ఆశ్రయించారు. దీనిని పరిశీలించాలని గుజరాత్ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. దీనిపై కమిటీని ఏర్పాటు చేసిన గుజరాత్ సర్కారు దోషులకు రెమిషన్ మంజూరు చేయాలని సిఫార్సు చేసింది. అయితే 14 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన వారికి గతేడాది ఆగస్టు 15న గుజరాత్‌ ప్రభుత్వం రెమిషన్‌ మంజూరు చేసింది.

Read Also: Landslide: తీవ్ర విషాదం.. కొండచరియలు విరిగిపడి 16 మంది మృతి

దోషులు జైలు నుంచి విడుదలైన అనంతరం వారిని పూలమాలలతో సత్కరించడం, మిఠాయిలు పంచడం అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఈ నేపథ్యంలోనే దోషులకు రెమిషన్‌ను సవాల్‌ చేస్తూ బిల్కిస్‌ బానో సహా పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సత్ప్రవర్తన కారణంగానే వారికి శిక్ష తగ్గించినట్లు గుజరాత్ ప్రభుత్వం సుప్రీంకు ఇచ్చిన అఫిడవిట్‌లో పేర్కొంది.