NTV Telugu Site icon

Bihar: మహ్మద్ ప్రవక్తపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..మండిపడుతున్న ప్రతిపక్షం

Chandra

Chandra

Bihar Education Minister Chandrashekar Comments  On Prophet Muhammad: మహ్మద్ ప్రవక్తపై బీహార్ విద్యాశాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.  శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా బాబా అభయనాథ్ ధామ్ ఆవరణలోని నలందాహిల్సా సబ్ డివిజన్‌లో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన మహమ్మద్ ప్రవక్తను మర్యాద పురుషోత్తముడు అని అభివర్ణించారు. ఎప్పుడైతే సెంట్రల్ ఏషియాలో నిజాయితీ అంతరించి పోయి, దుర్మార్గులు,చెడు పెరిగాయో అప్పుడు దైవం మీద నమ్మకం కలిగించడానికి దేవుడు మర్యాద పురుషోత్తముడు మహ్మద్ ప్రవక్తను భూమి మీదకు పంపించాడని పేర్కొన్నాడు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలనే బిహార్ లో ప్రతిపక్ష పార్టీ అయిన బీజేపీ నేతలు తప్పుబడుతున్నారు. ఎందుకంటే హిందూ పురాణాల ప్రకారం కేవలం రాముడిని మాత్రమే పురుషోత్తముడు అని సంబోధిస్తారు.

Also Read: G-20 Summit: రెండోరోజు G20 సమావేశాలు.. వాటిపైనే చర్చలు

ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి నిఖిల్ ఆనంద్ స్పందించారు.  జన్మాష్టమి కార్యక్రమంలోనే భగవాన్ శ్రీకృష్ణుడి పవిత్రతను కించపరిచే ప్రయత్నం మంత్రి చేశారని బీజేపీ నేత ఆరోపించారు. ప్రతిపక్ష కూటమి ఇండియా సనాతన ధర్మాన్ని కించపరిచేలా మాట్లాడుతుందని మండిపడ్డ ఆయన ఇస్లాం అనుకూల, పాకిస్తాన్ అనుకూల వ్యాఖ్యలతో ఓట్లు పొందాలని చూస్తుందన్నారు. మంత్రి సున్తీ చేయించుకొని, పాకిస్తాన్ వెళ్లిపోవాలని నిఖిల్ అన్నారు. చంద్రశేఖర్ మానసిక సమస్యలతో బాధపడుతున్నారని అందుకే ఒకసారి రామాయణంపై మరోసారి మహ్మద్ ప్రవక్తపై కామెంట్ చేస్తారని ఎద్దేవా చేశారు. ఇప్పటికే తమిళనాడు సీఎం స్టాలిన్ తనయుడు ఉదయనిధి సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నారు. ఆయన సనాతన ధర్మాన్ని మలేరియా, డెంగ్యూని నివారించినట్లే నివారించాలి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనిపై ప్రతిపక్షాలు విరుచుకుపడటమే కాకుండా ఉదయనిధిపై కేసులు కూడా నమోదయ్యాయి. అంతేకాకుండా ప్రతిపక్ష కూటమి ఇండియా కూడా చిక్కుల్లో ఇరుక్కుంది. ఈ నేపథ్యంలో చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఎటు దారి తీస్తాయో వేచి చూడాలి.