NTV Telugu Site icon

TDP: కర్నూలు జిల్లా టీడీపీలో కుదుపు..! పార్టీకి కీలక నేతలు గుడ్‌బై..?

Tdp

Tdp

TDP: ఎన్నికల సమయంలో.. నేతలు పార్టీలు మారడం సర్వసాధారణమైన విషయమే.. ఒక పార్టీలో సీటు దక్కలేదని.. మరో పార్టీ గూటికి చేరడం.. ప్రతీ ఎన్నికల్లో చూస్తూనే ఉంటాం.. అయితే, ఈ సార్వత్రిక ఎన్నికల వేళ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి భారీ గండి పడుతుందనే ప్రచారం సాగుతోంది.. జనసేన, బీజేపీలతో పొత్తుతో ఎన్నికలకు వెళ్తోంది తెలుగుదేశం పార్టీ.. పొత్తుల్లో భాగంగా కొందరు నేతలకు సీట్లు దక్కకపోతే.. మరికొన్ని స్థానాల్లో సీటు ఆశించినవారికి భంగపాటు తప్పలేదు. వాళ్లను కాదని మరో నేతకు సీటు కేటాయించడం కూడా ఆ పార్టీలో కుంపటి రాజేసింది.. అయితే, కర్నూలు జిల్లాలో టీడీపీకి భారీ గండి పడే అవకాశం ఉందంటున్నారు.. పార్టీలో కీలక నేతలుగా ఉన్న వ్యక్తులు ఇప్పుడు పక్కచూపులు చూస్తున్నారట.

Read Also: Mudragada Vs Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌పై ముద్రగడ సంచలన వ్యాఖ్యలు..

టీడీపీకి గుడ్ బై చెప్పే యోచనలో పలువురు కీలక నేతలు ఉన్నారనే ప్రచారం రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది.. ఈ నెల 12వ తేదీన పలువురు టీడీపీ నేతలు అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరతారని తెలుస్తోంది.. ఇప్పటికే వైసీపీతో టచ్ లోకి వెళ్లిపోయారట కొందరు నేతలు.. వారి దారిలోనే మరికొందరు నేతలు కూడా పార్టీని వీడే యోచనలో ఉన్నారట.. 12వ తేదీన సీఎం జగన్‌ సమక్షంలో మాజీ ఎమ్మెల్సీ మసాలా పద్మజ, ఆలూరు మాజీ టీడీపీ ఇంఛార్జ్‌ వైకుంఠం మల్లికార్జున, ఇద్దరు మాజీ జెడ్పీటీసీలు వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారట.. ఇక, రామసుబ్బారెడ్డి తో ఇప్పటికే చర్చలు జరిపారట మాజీ మంత్రి కేఈ ప్రభాకర్.. కానీ, కేఈ ప్రభాకర్ టీడీపీ వీడకుండా కేఈ కృష్ణమూర్తి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తురని తెలుస్తోంది.. మరోవైపు మంత్రాలయం టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు తిక్కారెడ్డి.. పార్టీ అధినేత చంద్రబాబుతో చర్చలతో సంతృప్తి పడలేదు.. మంత్రాలయం అసెంబ్లీ టికెట్ పై ఇప్పటికీ పట్టు వీడడం లేదు తిక్కారెడ్డి.. ఈ నేపథ్యంలో.. తిక్కారెడ్డి కూడా తన రాజకీయ భవిష్యత్‌పై ఓ నిర్ణయానికి వస్తారనే ప్రచారం సాగుతోంది. మరి ఈ వలసలకు టీడీపీ చెక్‌ పెడుతుందా? లేదంటా కర్నూలు జిల్లాలో టీడీపీలో భారీ కుదుపు తప్పదా? అనేది ఆసక్తికరంగా మారింది.