NTV Telugu Site icon

WTC 2025 Final: టీమిండియాకు బిగ్ షాక్.. అగ్రస్థానానికి దక్షిణాఫ్రికా జట్టు

Wtc Final

Wtc Final

శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా 109 పరుగుల తేడాతో విజయం సాధించి 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఈ విజయంతో దక్షిణాఫ్రికా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో చాలా లాభపడింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో సౌతాఫ్రికా ఇప్పుడు అగ్రస్థానానికి చేరుకుంది.

దక్షిణాఫ్రికా 6 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది:
అడిలైడ్‌లో భారత జట్టును ఓడించిన ఆస్ట్రేలియా WTC పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. అయితే కంగారూ జట్టు ఈ ప్రస్థానం ఎంతో సమయం ఉండలేదు. మరుసటి రోజు దక్షిణాఫ్రికా మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రస్తుత సైకిల్‌లో దక్షిణాఫ్రికా 10 మ్యాచ్‌లలో 6 గెలిచింది. 3 ఓడిపోగా, ఒక మ్యాచ్‌ డ్రాగా నిలిచింది. దక్షిణాఫ్రికా 76 పాయింట్లు ఉండగా.. పాయింట్ల శాతం 63.330గా ఉంది.

Read Also: BCCI: బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శిగా దేవ్‌జిత్ సైకియా నియామకం..

టీమిండియా మూడో స్థానానికి చేరుకుంది:
2023-25 ​​సైకిల్‌లో ఆస్ట్రేలియా 14 మ్యాచ్‌లలో 9 గెలిచింది.. 4 ఓడిపోయింది. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. కంగారూ జట్టు 102 పాయింట్లు ఉండగా.. పాయింట్ల శాతం 60.710గా ఉంది. అడిలైడ్‌లో ఓటమి తర్వాత భారత జట్టు మూడో స్థానానికి పడిపోయింది. ఈ సైకిల్‌లో టీమిండియా 16 మ్యాచ్‌లు ఆడి 9 విజయాలు సాధించింది. భారత్ 6 ఓడిపోగా.. ఒక మ్యాచ్ డ్రా అయింది. భారత జట్టుకు 110 పాయింట్లు ఉండగా.. పాయింట్ల శాతం 57.290 ఉంది. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడాల్సి వస్తే.. ఎట్టిపరిస్థితుల్లోనూ టాప్-2లో నిలవాల్సిందే. అందుకోసం.. ఇండియా-ఆస్ట్రేలియా మధ్య 5 మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరుగుతోంది. ప్రస్తుతం సిరీస్ 1-1తో సమంగా ఉంది. పెర్త్ టెస్టులో భారత్ 295 పరుగుల తేడాతో గెలుపొందగా.. అడిలైడ్ టెస్టులో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ ఫైనల్ ఆడాలంటే.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 4-1 లేదా 3-1 తేడాతో గెలవాలి.

WTC ఫైనల్‌కు భారత్ వెళ్లాలంటే..?
టీమిండియా BGTని 3-2తో గెలిస్తే.. ఫైనల్ ఆడేందుకు శ్రీలంకపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇందుకోసం శ్రీలంక 1 లేదా 2 టెస్టుల్లో ఆస్ట్రేలియాను ఓడించాల్సి ఉంటుంది.
భారత్-ఆస్ట్రేలియా మధ్య టెస్టు సిరీస్ 2-2తో సమంగా ఉంటే శ్రీలంక 2-0తో ఆస్ట్రేలియాను ఓడించాల్సి ఉంటుంది.
ఒకవేళ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా 2-3 తేడాతో ఓడిపోతే ఫైనల్ ఆడాలంటే రెండు జట్లపైనే ఆధారపడాల్సి ఉంటుంది.
ఈ పరిస్థితిలో పాకిస్థాన్ 2-0తో దక్షిణాఫ్రికాను ఓడించాల్సి ఉంటుంది. అదేవిధంగా తొలి టెస్టులో శ్రీలంకను ఆస్ట్రేలియా ఓడించాల్సి ఉంటుంది.