NTV Telugu Site icon

Mohammed Shami: గుజరాత్ టైటాన్స్కు భారీ షాక్.. ఐపీఎల్‌ 2024కు షమీ దూరం

Shami

Shami

ఐపీఎల్ 2024 మార్చి 22 నుండి ప్రారంభం కానుంది. దీని షెడ్యూల్కు సంబంధించి ఈ రోజు సాయంత్రం 5 గంటలకు వెలువడనుంది. కాగా.. షెడ్యూల్ ప్రకటించకముందే గుజరాత్ టైటాన్స్‌కు భారీ షాక్ తగిలింది. ఐపీఎల్ 2024 నుంచి గుజరాత్ టైటాన్స్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ దూరం అయ్యాడు. ఎడమ చీలమండ గాయం కారణంగా ఐపీఎల్ 2024 నుండి తప్పుకోవాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించి బీసీసీఐ వర్గాలు సమాచారం అందించాయి. అయితే గుజరాత్ టైటాన్స్, ఐపీఎల్‌ వర్గాలు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Read Also: Madhya Pradesh: స్నేహితుడిని పెళ్లి చేసుకునేందుకు లింగమార్పిడి ఆపరేషన్‌.. తర్వాత ఏమైందంటే..!

గత వన్డే ప్రపంచకప్‌ తర్వాత చీలమండ గాయం వల్లే ఏ సిరీస్‌లోనూ ఆడకుండా విశ్రాంతి తీసుకుంటున్నాడు. గుజరాత్‌ జట్టులో కీలకమైన షమీ లేకపోవడం పెద్ద దెబ్బే అని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రెండుసార్లు ఫైనల్‌కు చేరుకోవడంలో షమీ కీలక పాత్ర పోషించాడు. ఇదిలా ఉంటే.. షమీ జనవరి చివరి వారంలో లండన్‌లో ఉన్నాడని, అక్కడ తన చీలమండ గాయానికి ప్రత్యేక ఇంజెక్షన్లు చేయించుకున్నాడని, అయినప్పటికీ అతని నొప్పిని తగ్గించలేదని, ఇప్పుడు అతనికి ఆపరేషన్ తప్ప మరో మార్గం లేదని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. కాగా.. మహ్మద్ షమీ సర్జరీ కోసం యూకే వెళ్లనున్నట్లు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో షమీ ఐపీఎల్ ఆడటం కష్టమని అంటున్నారు.

Read Also: Shanmukh Jaswanth Case: గంజాయితో పట్టుబడ్డ షణ్ముఖ్, అన్నపై రేప్ కేసు… అసలు కథ ఇదే!