Bhuvneshwar Kumar: “అవకాశం వస్తే ఆడతా.. రాకపోయినా ఏం ఫర్వాలేదు.!” రీఎంట్రీపై ఫుల్ క్లారిటీ..

  • టీమిండియాలోకి రీఎంట్రీ ఇప్పుడు తన ప్రధాన లక్ష్యం కాదు..
  • అవకాశం వస్తే భారత్ తరఫున మళ్లీ ఆడతా..
  • రాకపోయినా ఎలాంటి బాధ లేదని స్పష్టం..
Bhuvneshwar Kumar

Bhuvneshwar Kumar

Bhuvneshwar Kumar: టీమిండియా ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ తన అంతర్జాతీయ క్రికెట్ భవిష్యత్తుపై తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. భారత జట్టులోకి రీఎంట్రీ కావాలనే ఆలోచనే ఇప్పుడు తనకు ప్రధాన లక్ష్యం కాదని టెక్లచి చెప్పేసాడు. ప్రస్తుతం తాను పూర్తిగా క్రికెట్‌పై ఉన్న ప్రేమతోనే ఆడుతున్నానని, జాతీయ జట్టులో మళ్లీ అవకాశం వస్తే స్వాగతిస్తానని.. రాకపోయినా ఎలాంటి బాధ లేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

తాజాగా ఆర్‌సీబీ (RCB) పోడ్‌కాస్ట్‌లో మాట్లాడిన భువనేశ్వర్ కుమార్.. “భారత్ తరఫున ఆడటం నా కల. ఆ కల ఇప్పటికే నెరవేరింది. తాను ఇప్పుడు కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. మళ్లీ అవకాశం వస్తే చాలా సంతోషమే. కానీ, ప్రస్తుతం నేను ఆడేది క్రికెట్‌పై ఉన్న మక్కువతో మాత్రమే” అని అన్నారు. 2022 చివర్లో చివరిసారిగా టీమిండియా తరఫున ఆడిన ఈ పేస్ బౌలర్.. ఇప్పటివరకు భారత్‌కు 21 టెస్టులు, 121 వన్డేలు, 87 టీ20 మ్యాచ్‌లు ఆడారు. ఐపీఎల్ 2026లో ఆర్‌సీబీ టైటిల్ గెలవడంలో కూడా భూవీ కీలక పాత్ర పోషించారు.

అలాగే టీమిండియాలో చోటు దక్కకపోవడంపై తన కుటుంబం ఎప్పుడూ చర్చించదని భువీ చెప్పుకొచ్చాడు. “మా ఇంట్లో క్రికెట్ గురించి పెద్దగా మాట్లాడం.. జట్టులోకి ఎందుకు ఎంపిక కాలేదు.? మళ్లీ ఎప్పుడు ఆడతావు.? అనే ప్రశ్నలు ఎప్పుడూ ఉండవు. అదే నాకు మానసిక ప్రశాంతతను ఇస్తుందని తెలిపారు.

క్రీడల్లో తరాల మార్పు సహజం. నేను మొదటి ఆటగాడిని కాదు.. చివరి ఆటగాడిని కూడా కాదు. అందుకే, ఎలాంటి బాధ లేకుండా ప్రస్తుతం ఉన్న పరిస్థితిని ఆనందంగా స్వీకరించానని తన రీఎంట్రీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చారు. తాను ఇంకా ఫిట్‌గా ఉండేందుకు దేశవాళీ క్రికెట్‌తో పాటు యూపీ టీ20 లీగ్లో కూడా ఆడుతున్నానని చెప్పుకొచ్చారు. ఆటతో అనుబంధం కొనసాగేందుకు తగినన్ని మ్యాచ్‌లు ఆడుతాను.. అదే సమయంలో శరీరానికి విశ్రాంతి కూడా ఇస్తాను. క్రమశిక్షణతో ముందుకు సాగుతున్నానని తన జీవిత ప్రయాణం గురించి క్షుణంగా తెలిపారు.

మరోవైపు భారత ఫాస్ట్ బౌలింగ్ బలపడటానికి ఐపీఎల్‌తో పాటు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ కోచ్ రవి శాస్త్రి కీలక పాత్ర పోషించారని భువనేశ్వర్ అన్నారు. ఐపీఎల్ వల్ల ఎంతో మంది యువ ఫాస్ట్ బౌలర్లకు అవకాశాలు వచ్చాయి. అలాగే విదేశీ పర్యటనలకు ముందు స్వదేశంలో కూడా పేస్ బౌలర్లకు అనుకూలమైన పిచ్‌లను సిద్ధం చేయడం విరాట్, రవి శాస్త్రి దూరదృష్టికి నిదర్శనమని.. అలాంటి చిన్న నిర్ణయాలే భారత పేస్ దళాన్ని బలోపేతం చేశాయని పేర్కొన్నారు.

అలాగే తన కెరీర్ ప్రారంభ రోజులను గుర్తుచేసుకున్న భువనేశ్వర్.. మాజీ భారత పేసర్ ప్రవీణ్ కుమార్ తనకు స్ఫూర్తిగా నిలిచారని చెప్పారు. మేమిద్దరం ఒకే అకాడమీ నుంచి వచ్చాం. నేను చిన్నప్పుడు ఆయనను ఎక్కువ ప్రశ్నలు అడగడానికి సిగ్గుపడేవాడిని.. కానీ, ఆయన బౌలింగ్‌ను జాగ్రత్తగా గమనించేవాడినని అన్నారు. కోచ్‌లు, సీనియర్ ఆటగాళ్ల నుంచి నేర్చుకున్న మౌలిక అంశాలే ఇప్పటికీ నా బౌలింగ్‌కు బలంగా నిలిచాయని భువనేశ్వర్ కుమార్ తెలిపారు.