Poguleti Srinivas Reddy : జోగుళాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలంలో శనివారం జరిగిన “భూభారతి 2025” చట్టంపై అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, పౌరసంబంధాల శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తీసుకొచ్చిన భూభారతి చట్టం పేద రైతులకు మహా ప్రసాదంగా నిలుస్తుందని చెప్పారు. పొంగులేటి ధరణి చట్టంపై తీవ్ర విమర్శలు చేస్తూ, అది కొద్ది మంది వ్యక్తులు, నాలుగు గోడల మధ్య కూర్చొని తయారు చేసిన చట్టమని విమర్శించారు. ఇది పేద ప్రజలను, చిన్న రైతులను అణచివేయడానికి ఉపయోగపడిందని ఆరోపించారు. అందుకే సీఎం రేవంత్ ధరణి చట్టాన్ని రద్దు చేసి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చారని చెప్పారు.
గతంలో ధరణి చట్టం వల్ల చిన్న పొరపాట్లకే రైతులు తమ భూముల సమస్యలు పరిష్కరించుకోవడానికి భారీగా ఖర్చులు పెట్టి, ఎమ్మార్వో, ఆర్డీవో, కలెక్టర్ల కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేదని పేర్కొన్నారు. ఇప్పుడు భూభారతి చట్టం ద్వారా రెవెన్యూ అధికారులు గ్రామానికే వచ్చి రైతుల సమస్యలను గ్రామంలోనే పరిష్కరిస్తారని తెలిపారు. సాదాబైనామాలతో భూములు కొనుగోలు చేసి పాస్‌బుక్ లేకుండా వ్యవసాయం చేస్తున్న వారికి ఈ చట్టం లబ్ధిని చేకూరుస్తుందని చెప్పారు. అలాగే, 2020లో ధరణిలో నమోదైన, ఇంకా పరిష్కారం లభించని 9,26,000 దరఖాస్తుల విషయాన్ని ప్రస్తావిస్తూ, అర్హులైనవారికి తగిన పరిష్కారం అందిస్తామని హామీ ఇచ్చారు.
భవిష్యత్తులో భూమికి ఆధార్ లాంటి “భూధార్” కార్డు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. భూభారతి చట్టాన్ని పైలట్ ప్రాజెక్టుగా నాలుగు జిల్లాల్లో అమలు చేసి, మే మొదటి వారం నుంచి గ్రామాలకు రెవెన్యూ అధికారులు వెళ్లి దరఖాస్తులు స్వీకరిస్తారని చెప్పారు. జూన్ 2 నాటికి సమస్యలు పరిష్కరించనున్నట్లు వెల్లడించారు. అలాగే, దేశంలో ఎక్కడా లేని విధంగా తక్కువ ధరకు సన్నబియ్యం పంపిణీ, రూ.500కే గ్యాస్ వంటి పథకాలను తెలంగాణలో అమలు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో రూ.200 కోట్ల వ్యయంతో జిల్లాలో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని కూడా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మల్లు రవి, డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, కలెక్టర్ బీఎం సంతోష్, అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.
PBK vs RCB: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ.. గెలుపు ఎవరిది?
