నేడు భోగి పండుగ తో పాటు షట్తిల ఏకాదశి. అంటే తెలుగు వారు అత్యంత వైభవంగా జరుపుకునే సంక్రాంతి సంబరాల్లో మొదటి రోజైన భోగి పండుగ నేడు ఎంతో విశిష్టతను సంతరించుకుంది. సాధారణంగా భోగి మంటలు, పిండి వంటలతో సందడిగా సాగే ఈ పండుగకు ఈ ఏడాది అదనంగా ఆధ్యాత్మిక శోభ తోడైంది. అదేంటి అంటే.. నేడు భోగి పండుగ రోజునే షట్తిల ఏకాదశి తిథి కూడా రావడమే దీనికి ప్రధాన కారణం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇలా భోగి – ఏకాదశి ఒకే రోజున రావడం చాలా అరుదైన విషయమని, మళ్లీ ఇలాంటి అద్భుతమైన కలయిక చూడాలంటే 2040 సంవత్సరం వరకు వేచి చూడాల్సిందేనని పండితులు చెబుతున్నారు.
దానధర్మాలు – విశేష ఫలితాలు:
షట్తిల ఏకాదశి పర్వదినం సందర్భంగా నువ్వులను దానం చేయడం అత్యంత శ్రేష్ఠమైనది.నువ్వులతో పాటు బెల్లం, కొత్త దుస్తులు, నెయ్యిని దానం ఇస్తే పుణ్యఫలం లభిస్తుంది. చలికాలం కావడంతో ఉప్పు, చెప్పులు, దుప్పట్లను అర్హులకు అందజేయడం శుభప్రదమని భక్తుల నమ్మకం. అలాగే నేడు ఉపవాసం ఉండి శ్రీమహావిష్ణువును భక్తిశ్రద్ధలతో పూజిస్తే, ఆ దేవుని కృపతో జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయని విశ్వసిస్తారు. ఈ అరుదైన పండుగ వేళ భక్తితో దానధర్మాలు చేస్తూ, విష్ణుమూర్తి అనుగ్రహం పొంది కష్టాలను దూరం చేసుకోవచ్చు. ఈ రోజున చేసే చిన్న దానం కూడా అనంతమైన పుణ్యాన్ని ఇస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి.