Site icon NTV Telugu

Airport In AP: ఏపీలో కొత్త విమానాశ్రయం.. ప్రారంభోత్సవ తేదీ ఇదే.

Airports

Airports

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చబోతున్న ప్రతిష్టాత్మక భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కలను సాకారం చేస్తూ, ఈ విమానాశ్రయాన్ని త్వరితగతిన అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి, భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి రావాలని అధికారికంగా ఆహ్వానించారు. ఈ విమానాశ్రయం రాష్ట్ర పారిశ్రామిక వృద్ధికి కీలకం కానున్న నేపథ్యంలో ప్రధాని చేతుల మీదుగా దీనిని ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది.

ప్రధాని కార్యాలయానికి ముఖ్యమంత్రి కొన్ని కీలక తేదీలను ప్రతిపాదించారు. ప్రధాని వెసులుబాటును బట్టి జూలై 5 లేదా 8వ తేదీలు.. ఆగస్టు 17 లేదా 19వ తేదీల్లో ఏదో ఒక రోజు ప్రారంభోత్సవం నిర్వహించే అవకాశం ఉంది. ఈ విమానాశ్రయ నిర్మాణ బాధ్యతలను చేపట్టిన జీఎంఆర్ సంస్థకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. జూన్ 30వ తేదీ నాటికి విమానాశ్రయానికి సంబంధించిన అన్ని ప్రధాన పనులు పూర్తి కావాలని గడువు విధించింది. రన్‌వే, టెర్మినల్ బిల్డింగ్, ఇతర సాంకేతిక పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేలా అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

ఉత్తరాంధ్రకు ఊతం..

భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వస్తే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పర్యాటక రంగంతో పాటు ఐటీ, ఫార్మా రంగాలు గణనీయంగా వృద్ధి చెందుతాయి. ఇది అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మితమవుతున్నందున.. విదేశీ పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ ఒక ప్రధాన కేంద్రంగా మారుతుందని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది. రాష్ట్ర అభివృద్ధిలో ఇదొక మైలురాయిగా నిలవనుండటంతో.. అధికారులు , నిర్మాణ సంస్థ సమన్వయంతో అహర్నిశలు శ్రమిస్తున్నారు.

Exit mobile version