రాష్ట్రంలో సోలార్ పవర్‌ను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావాలన్న దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గృహ అవసరాలకే కాకుండా వ్యవసాయ రంగానికి కూడా సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించాలన్న లక్ష్యంతో పలు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. శాసన మండలిలో ఈ అంశంపై మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్య ఘర్ పథకానికి ప్రజల నుంచి అనుకున్నంత స్థాయిలో స్పందన రావడం లేదని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ఉచిత విద్యుత్ అందిస్తున్న నేపథ్యంలో సోలార్ ప్యానెల్స్ కోసం ఇంటి మీద రూఫ్ ఏర్పాటు చేయాల్సి రావడం కూడా ప్రజలు వెనకడుగు వేయడానికి కారణమవుతోందని చెప్పారు.
పీఎం కుసుమ్ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయాలనే ఉద్దేశంతో కొడంగల్, బొనకల్ మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా సోలార్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత సబ్సిడీ అందుతుందని, మొత్తం పథకం వ్యయం సుమారు రూ.519 కోట్ల రూపాయలు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి రెడ్కో నోడల్ ఏజెన్సీగా పనిచేస్తోందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 52 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, అదేవిధంగా 20 లక్షల విద్యుత్ కనెక్షన్లను పీఎం సూర్య ఘర్ పథకంతో అనుసంధానం చేయాలనే అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి చర్చించామని తెలిపారు.
స్వయం సహాయక సంఘాలకు పొలాల్లో సోలార్ యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఉన్నప్పటికీ, లీజు భూముల్లో ఈ సదుపాయం కల్పించలేమని కేంద్ర నిబంధనలు స్పష్టం చేస్తున్నాయని డిప్యూటీ సీఎం భట్టి చెప్పారు. ఈ కారణంగా రైతులు కూడా పీఎం కుసుమ్ పథకంపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదన్నారు. అయినప్పటికీ సాధ్యమైనంత వరకు ఈ పథకాలను అమలు చేసి సోలార్ విద్యుత్ వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు బీజేపీ సభ్యులు సహకరించాలని కోరారు.
Also Read: Phone Tapping Case:: ఫోన్ ట్యాపింగ్ కేసు.. సుప్రీం కోర్టులో హరీష్ రావుకు ఊరట!
‘ట్రాన్స్ ఫార్మర్స్, వ్యవసాయ పంపు సెట్ల కోసం రైతులు దరఖాస్తు చేసుకున్నారు. 3,48,462 మంది దరఖాస్తు చేసుకున్నారు. 75 పైచిలుకు ట్రాన్స్ ఫార్మర్స్ మంజూరు చేశాం. విద్యుత్ శాఖలో చాలా సంస్కరణలు తీసుకు వచ్చాము. 1912 కు ఫోన్ చేస్తే ఎలక్ట్రికల్ అంబులెన్స్ ద్వారా ఫిర్యాదు చేసిన ప్రాంతానికి వెళ్లి సమస్య పరిష్కారం చేస్తారు. అడిగిన వారికి ట్రాన్స్ ఫార్మర్స్ ఇస్తున్నాం. గత కొంతకాలంగా విద్యుత్ శాఖలో ప్రజా బాట నిర్వహించి సమస్యలు పరిష్కరిస్తున్నాం. గత ఏడాది 56807 spdcl పరిధిలో కొత్త కనెక్షన్లు, ఎన్పిడీసీఎల్లో 41 086 కనెక్షన్లు.. మొత్తంగా 97893 కొత్త కనెక్షన్లు ఇచ్చాము. ఈ ఏడాదిలో మరో 20 వేల కొత్త కనెక్షన్లు ఇస్తాం. రాష్ట్రంలో ట్రాన్స్ ఫార్మర్స్ కొరత లేదు’ అని డిప్యూటీ సీఎం చెప్పారు.
