NTV Telugu Site icon

Bhatti Vikramarka Peoples March Padayatra: 100వ రోజుకు చేరిన భట్టి విక్రమార్క పాదయాత్ర

Bhatti Vikramarka

Bhatti Vikramarka

Bhatti Vikramarka Peoples March Padayatra: సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర వందో రోజుకు చేరువైంది.. విక్రమార్క పాదయాత్ర 100వ రోజు శుక్రవారం నాడు నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో కొనసాగనుంది. నకిరేకల్ నియోజకవర్గం కేతేపల్లి నుంచి ఉదయం 7:30 గంటలకు పాదయాత్ర ప్రారంభం కానుండగా.. కేతేపల్లి, చీకటి గూడెం, ఉప్పల్ పహాడ్, భాగ్యనగరం, కొప్పోలు గ్రామాల్లో పాదయాత్ర కొనసాగుతుంది. ఉప్పల్ పహాడ్ గ్రామంలో లంచ్ బ్రేక్ ఏర్పాటు చేయనున్నారు.. రాత్రికి కొప్పోలు గ్రామంలో బస చేయనున్నారు భట్టి విక్రమార్క.. అనారోగ్య సమస్యకారణంగా తాత్కాలికంగా పాదయాత్రకు బ్రేక్‌ ఇచ్చిన భట్టి విక్రమార్క.. రేపటినుండి తిరిగి పీపుల్స్‌ మార్చ్‌ని ప్రారంభించనున్నారు.. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటూ పాదయాత్ర చేయవచ్చని డాక్టర్లు సూచించడంతో.. డాక్టర్ల సూచన మేరకు రేపటినుండి పాదయాత్ర ప్రారంభిస్తున్నారు..

కాంగ్రెస్‌ పార్టీలో జోష్‌ పెంచుతూ ముందుకు సాగుతున్నారు భట్టి విక్రమార్క.. తమ మధ్య ఉన్న విభేదాలు పక్కనబెట్టి అంతా కలిసి వస్తున్నారని కాంగ్రెస్‌ శ్రేణులు చెబుతున్నాయి.. ప్రతి ఇంటి గడప తాకుతూ.. ప్రతీ గుండెను పలకరిస్తూ.. మహిళలు, యువకులు, రైతులు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, గొల్ల కురుమలు, చిరు వ్యాపారస్తులు, చేనేత కార్మికులు, వృద్ధులు.. అందరినీ కదిలిస్తూ.. వారి కష్టాలు తెలుసుకుంటూ.. వారి ఆశీర్వాదం పొందుతూ.. సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇస్తూ పట్టు వదలని విక్రమార్కుడిలా.. పీపుల్స్‌ మార్చ్‌ పేరుతో ముందుకు సాగుతున్నారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క.. గ్రామాలలో పండుగలా పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కదులుతోంది.. పాలకులకు పాఠం నేర్పాలనే లక్ష్యంతోనే ప్రభంజనంతో పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సాగుతుంది అంటున్నారు విక్రమార్క.. నడకలో ఉత్సాహం నింపుతూ.. జనంతో మమేకమవుతూ.. సమస్యలు వింటూ.. పరిష్కార మార్గాలు చూపుతూ.. వచ్చేది మా ప్రభుత్వమే ఇక, మీ కష్టాలు అన్నీ తీరుస్తాం అని అభయం ఇస్తూ వడివడిగా అడుగులు వేస్తున్నారు.. కొన్ని ప్రతీకూల పరిస్థితులు ఎదురైనా.. బ్రేక్‌ ఇచ్చినా.. మళ్లీ ముందుకు కదులుతున్నారు..

మార్చి 16న చేప‌ట్టిన పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర ఇప్పుడు వందో రోజుకు చేరువైంది..మార్చిన 16న ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజ‌క‌వ‌ర్గం బజరహాత్నూర్ మండ‌లం పిప్పిరి గ్రామం నుంచి పాద‌యాత్రను ప్రారంభించారు భట్టి.. బోథ్‌, ఖానాపూర్, ఆసిఫాబాద్, బెల్లంప‌ల్లి, చెన్నూర్, మంచిర్యాల‌, రామ‌గుండం, ధ‌ర్మపురి, పెద్దప‌ల్లి, హుజూరాబాద్, హుస్నాబాద్, వ‌ర్ధన్నపేట‌, వ‌రంగ‌ల్ వెస్ట్, స్టేష‌న్ ఘ‌న్ పూర్, జ‌న‌గామ‌, అలేరు, భువ‌న‌గిరి, ఇబ్రహీంప‌ట్నం, ఎల్బీన‌గ‌ర్, మ‌హేశ్వరం, రాజేంద్రనగర్, చేవెళ్ల, షాద్ న‌గ‌ర్, ప‌రిగి, జడ్చర్ల, నాగ‌ర్ క‌ర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట, దేవరకొండ, నాగార్జునసాగర్‌, నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా ఇప్పుడు నకిరేకల్‌లో సాగుతోంది భట్టి పాదయాత్ర.. గాలి దుమారాలు.. విపరీత ఎండలు.. ఊహించని భారీ వర్షాలు.. అయినా కూడా తనతో నడిచే కార్యకర్తలతో సమానంగా టెంట్ లో ఉంటూ.. వారితో కలిసి తింటూ.. కలియ తిరుగుతున్న భట్టి విక్రమార్క.. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, హన్మకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్‌, నాగర్ కర్నూల్, నల్గొండ జిల్లాల్లో పాదయాత్ర ముగియగా.. సూర్యాపేట మీదుగా ఖమ్మం జిల్లాలో అడుగుపెట్టనున్నారు భట్టి విక్రమార్క.

ఇక, కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు సిద్ధమైన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఈ రోజు భట్టితో సమావేశమయ్యారు.. పాదయాత్ర ముగింపు సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించాలని.. రాహుల్‌ గాంధీని ఈ సభకు రప్పించాలనే ప్రయత్నాల్లో ఉన్నారు.. ఇప్పుడు పొంగులేటి బలం కూడా తోడు కావడంతో.. ఖమ్మం సభ విజయవంతం అవుతుంది అంటున్నారు. మొత్తంగా.. పార్టీలో ఉన్న కొన్ని సమస్యలు పరిష్కారం అవుతుండగా.. కొత్త నేతలు కూడా పార్టీలోకి వస్తుండడంతో.. హస్తం పార్టీకి తిరుగులేదని చెబుతున్నారు విశ్లేషకులు.