NTV Telugu Site icon

Bhatti Vikramarka : సీఎం కేసీఆర్‌కు సీఎల్పీ నేత భట్టి బహిరంగ లేఖ

Bhatti

Bhatti

సింగరేణి తెలంగాణ కల్పతరువని, తెలంగాణ పాలిట వరప్రదాయనే కాదు తెలంగాణ కు సింగరేణి ఓ గ్రోత్‌ ఇంజిన్‌ అని, కానీ నేడు సింగరేణి మనుగడపై మన్ను పోసింది ఎవ్వరు? అని ప్రశ్నించారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. హాత్‌ సే హత్‌ జోడో అభియాన్‌ పేరిట ఆయన పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఆయన సింగరేణిపై సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. ‘వేలాది మందికి ప్రత్యక్షంగా లక్షల మందికి పరోక్షంగా ఉపాధినిచ్చే సింగరేణిలో ఇప్పుడు ఉద్యోగాలు ఎందుకు పెరగడం లేదు? ఉన్న ఉద్యోగులు ఎందుకు తగ్గిపోతున్నారు? వేల కోట్ల డిపాజిట్లతో లాభాల బాటలో ఉన్న సింగరేణి నేడు ఎందుకు అప్పుల కోసం బ్యాంక్‌ ల చుట్టు తిరుగుతున్నారు? సింగరేణిని అప్పుల ఊబిలోకి నెట్టింది ఎవ్వరు? భూగర్బ గనుల్లో ప్రాణాలు పణంగా పెట్టి రక్తాన్ని చెమటగా చిందిస్తూ జాతికి వెలుగులు అందించే కార్మికుల జీవితాల్లో చీకట్లు నింపుతుంది. ఎవ్వరు? పోరాటాలకు పిడికిలి బిగించే కార్మికవాడల్లో ఉద్యమాలు అణచివేయడమే కాదు కార్మిక హక్కులను కాలరాసింది ఎవ్వరు? నాడు తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మెలో కదం తొక్కిన నల్ల సూరీళ్లు నేడు హక్కుల కోసం ఎందుకు పిడికిలి బిగించడం లేదు? గొంతెత్తే ట్రేడ్‌ యూనియన్‌ నేతలు ఎందుకు మూగబోయారు? సింగరేణిలో ఒక్కో ఉద్యోగాన్ని లక్షలకు అమ్ముకున్న దళారులు ఎవ్వరు? వారి వెనుకున్న అధికార నేతలు ఎవ్వరు? ఎన్నడు లేని విధంగా సింగరేణిలో హైటెక్‌ కాపీయింగ్‌ జరిగితే ఆ విచారణ ఏమైంది? క్విడ్‌ ప్రో తో వందల కోట్లు దోచిపెట్టిన ఘనుడు ఎవ్వరు? సింగరేణి ని కేసీఆర్‌ ఫ్యామిలీ కంపెనీ లిమిటెడ్‌ గా మార్చితే ఎర్ర జెండా పార్టీల సంఘాలు ఎందుకు నిశ్శబ్ధంగా ఉన్నాయి? ఈ ప్రశ్నలు పీపుల్స్‌ మార్చ్‌ యాత్రలో కార్మిక సోదరులు నన్ను కలిసినప్పుడు చర్చలకు రాగా ఈ బహిరంగ లేఖ ద్వారా తెలంగాణ సమాజానికి తెలియపరచాలనే బాధ్యతతో ఈ లేఖ రాస్తున్నా. సింగరేణి నూట ముప్పై కు పైగా సంవత్సరాల చరిత్ర. 1885 లో నిజాం కాలంలో బిట్రీష్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ విలియం కింగ్‌ కారేపల్లి మండలం సింగరేణి వద్ద బొగ్గు నిక్షేపాలు ఉన్నట్టు గుర్తించారు.

Also Read : Bengaluru: మోడీ ప్రారంభించిన మెట్రో స్టేషన్‌.. నల్లూర్‌హళ్లిని ముంచెత్తిన వరద

దాంతో బొగ్గు తవ్వకాల కోసం నాటి నిజాం ప్రభువు ఆంగ్లేయులతో ఒప్పందం చేసుకోగా. 1889 లో బొగ్గు తవ్వకాలు ప్రారంభం అయ్యాయి. దక్కన్‌ కంపెనీ లిమిటెడ్‌ పేరుతో ఉన్న కంపెనీని 1920 డిసెంబర్‌ 23 న సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ పేరుతో సింగరేణి ఆవిర్బావం జరిగింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక సింగరేణిలో 49 శాతం వాటా కేంద్రం 51 శాతం సింగరేణికి దక్కింది. నాడు లక్షా ఇరవై వేల మంది ప్రత్యక్షంగా ఉద్యోగాల్లో ఉంటే లక్షల మందికి పరోక్షంగా సింగరేణి ఉపాధి కల్పించింది. ఖమ్మం జిల్లా ఇల్లందులో మొదలైన సింగరేణి ప్రస్థానం ఉమ్మడి జిల్లాలైన ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాలో విస్తరించింది. తెలంగాణ ఆవిర్భావం జరిగే నాటికి 62 వేల మంది ఉద్యోగులు 3 వేల 500 కోట్ల బ్యాంక్‌ డిపాజిట్‌ తో ప్రగతి పధంలో ఉంది సింగరేణి. కేసీఆర్‌ పాలనలో సింగరేణిని అవినీతి మేఘాలు కమ్మేసాయి. ఉద్యమ సమయంలో ఉద్యోగాలను పణంగా పెట్టి సకలజనుల సమ్మెలో కదం తొక్కారు నల్ల సూరీళ్లు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ గద్దెనెక్కాక సమైక్య రాష్ట్రంలో కూడా లేని విధంగా కార్మికుల హక్కులు కాలరాస్తూ గొంతెత్తే నోళ్లను మూసివేస్తూ కోల్‌ బెల్ట్‌ లో అప్రకటిత ఎమర్జన్సీ కొనసాగుతుంది. నన్ను కలిసిన కార్మికులు కొందరు మాట్లాడుతూ బంగారు తెలంగాణలో బొగ్గు బావులు బొందలు గడ్డలు కానివ్వం అన్న కేసీఆర్‌ మా బతుకులపై మన్ను పోస్తుండు, కేసీఆర్‌ ఏ స్థాయి నియంతో చెప్పాలంటే ఒక్క ఉదాహరణ గా ట్రేడ్‌ యూనియన్‌ ఎన్నికలు నిలుస్తాయి. గుర్తింపు సంఘం ఎన్నికల కాలపరిమితి ముగిసినా ఎన్నికలు నిర్వహించకుండా ట్రేడ్‌ యూనియన్లను గడ్డి పోచలా మార్చిండు.నాడు సకల జనుల సమ్మెలో మీ అంత గొప్పోళ్లు లేరన్న కేసీఆర్‌ నేడు కనీసం కార్మిక నేతలకు కలిసే టైం ఇవ్వని దుస్థితి. కేసీఆర్‌ కుమార్తె కవిత తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలిగా 2017 లో జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో జనరల్‌ ఎలక్షన్‌ మాదిరి కోల్‌ బెల్ట్‌ ఎన్నికలను కరెన్సీ నోట్లతో ప్రభావితం చేసి కలుషితం చేసారని కార్మిక సంఘాలను తమ చెప్పు చేతల్లో పెట్టుకొని, కార్మికుల హక్కుల కోసం మాట్లాడే వారు లేకుండా సింగరేణి కల్వకుంట్ల కుటుంబం లిమిటెడ్‌ కంపెనీ గా మార్చారని కార్మికులు నాతో అంటుంటే హక్కుల కోసం నిత్యం పోరాడీ ఎర్రజెండా పార్టీలు కేసీఆర్‌ పక్కన చేరితే ఇక కార్మికులకు దిక్కెవరు అని టీబీజీకెఎస్‌ నేతలే ఆవేదన వ్యక్తం చేస్తూ సింగరేణి బతకాలంటే ఐ.ఎన్‌.టీ.యూసీ నిలబడాలని వారే కోరుతున్నారంటే కేసీఆర్‌ హయంలో సింగరేణిలో కార్మికుల పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో అర్థం చేసుకోవోచ్చు.

Also Read : Dharmavaram Erraguttta: ఎర్రగుట్టే హాట్ టాపిక్.. ఏమా కథాకమామీషు?

కేసీఆర్‌ పాలనలో సింగరేణిలో మొదటి సారి 2015 లో క్లరికల్‌ ఎగ్జామ్‌ నిర్వహించారు. ఆ పరీక్షలలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని పరీక్ష రాసిన అభ్యర్ధులు ఆధారాలతో పోరాటం చేసినా కేసీఆర్‌ ప్రభుత్వం తొక్కేసింది. ఆ పరీక్షలలో ఓక్కో ఉద్యోగం ముప్పై నుంచి నలభై లక్షలకు అమ్ముకున్నారని ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. తర్వాత 2020 లో మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పరీక్షలో హైటెక్‌ కాపీయింగ్‌ బట్టబయలైంది. ఓక్కో ఉద్యోగం నలభై నుంచి యాభై లక్షలకు అమ్మకునేలా డమ్మీ అభ్యర్థులతో హర్యానా ఢల్లీి కి చెందిన హైటెక్‌ కాపీయింగ్‌ ముఠా పరీక్ష రాస్తూ దొరికిపోయారు. దానిపై విచారణ ఏమైంది, మళ్లీ పరీక్ష ఎందుకు నిర్వహించలేదు ఎవ్వరికి అంతుపట్టని రహస్యం. తర్వాత 2002 సెప్టెంబర్‌లో 177 జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలకు పరీక్ష నిర్వహించారు. పెద్దఎత్తున అక్రమాలు జరిగాయని కొందరికి పరీక్ష పత్రం ఇచ్చి ఇతర పాంతాల్లో పరీక్ష పెట్టి మరీ కోరుకున్న వారికి ఒక్కో ఉద్యోగం నలభై లక్షలకు కొనే వారికి అమ్మారని పరీక్ష రాసిన అభ్యర్థులు ఆధారలతో న్యాయ పోరాటం చేస్తున్నారు. కేసీఆర్‌ పాలనలో సింగరేణిలో ఉద్యోగ నియామకాల కోసం నిర్వహించిన పరీక్షల్లో ఎలా అవినీతి జరిగిందో అర్థమవుతుంది. సింగరేణి అంటే కార్మిక లోకం ప్రాణాలు పణంగా పెట్టి జాతికి వెలుగులు అందించే నల్ల సూరీళ్లు.స్వరాష్ట్రం కోసం తమ కొలువులు పణంగా పెట్టి పోరుబాట చేస్తే తీరా ఏ నాయకుడినైతే నమ్మామో ఆ నాయకుడి పాలనలో మా హక్కులు కాలరాసి మా పిల్లల భవిష్యత్‌ను కాసుల కోసం తాకట్టు పెట్టే ఇంత అవినీతి పాలన ఏందయ్యా ఆరోగ్యం బాగోలేక అన్‌ ఫిట్‌ సర్టిఫికేట్‌ రావాలన్నా అధికార పార్టీ నేతల జేబులు నింపాలా, ఎవ్వరి కోసం ఇదంతా గతంలో సింగరేణి ఎలా ఉంది ఈ కేసీఆర్‌ పాలనలో ఎలా తయారైంది. ఓ పక్క రెగ్యులర్‌ ఉద్యోగులు 62 వేల నుంచి 42 వేలకు పడిపోయారు. మరోపక్క ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు పది వేల నుంచి ముప్పై వేలకు పెరిగారు. కేసీఆర్‌ పాలనలో 60 వేల మంది ఉద్యోగాలు పోయి రోడ్డు పాలయ్యారు. బొందల గడ్డలు వద్దన్న కేసీఆర్‌ ఓపెన్‌ కాస్ట్‌ గనుల విస్తరణకు పచ్చజెండా ఊపిండు. ఓపెన్‌ మైనింగ్‌లలో చెన్నూరును బొందల గడ్డగా మార్చారు. తెలంగాణ ఉద్యమంలో స్థానికులకే ఉద్యోగాలు అనే నినాదంతో యువతను ప్రేరేపించిన కేసీఆర్‌ అధికారంలోకి వచ్చాక మాట తప్పారు. గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఓబి మాత్రమే ప్రైవేట్‌ వ్యవస్థకు ఇచ్చేవారు. రాష్ట్రం ఏర్పడ్డాక ఓబితో పాటు మైన్లను కూడా ప్రైవేట్‌ వారికి అప్పజెపుతున్నారు. దీనితో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు అడియాశలు అవుతున్నాయి. ఈ ప్రయివేటీకరణతో దాదాపు 42 వేల ఉద్యోగాలు పోయాయి. తెలంగాణ ఉద్యమలక్ష్యం ఇదేనా! అని స్థానికులు కేసీఆర్‌ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులను కదం తొక్కించి ఇవాళ కేసీఆర్‌ తన పాలనలో కార్మిక హక్కులను కాలరాస్తూ సింగరేణి ని ఆర్ధికంగా నష్టాల బాట పట్టించారని ట్రేడ్‌ యూనియన్‌ నేతలు ఆవేదన వ్యక్తం చేసారు. కోల్‌ బకాయిలు విద్యుత్‌ బకాయిలు చెల్లించకుండా ఇప్పటికి వడ్డీలతో కలిసి ఇరవై వేల కోట్లు దాటాయని మరోపక్క ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలంటే బ్యాంక్‌ల చుట్టూ తిరిగే పరిస్థితి కల్పించిన పాలనగా కేసీఆర్‌ మిగిలిపోయిందని సొంత పార్టీ నేతలు కొందరు నాతో అంటున్నారు.
తాడిచర్ల మైనింగ్‌ ప్రైవేట్‌పరం చేయొద్దని నాడు ఉద్యమ సమయంలో పోరాటాలు చేసిన బీ.అర్‌.ఎస్‌ అధికారంలోకి రాగానే అదే తాడిచర్ల ఓపెన్‌ కాస్ట్‌ ను తమ అనుచరులకు కట్టబెట్టి వందల కోట్లు దోచుకుంటున్న విషయం బహిరంగ రహస్యం. మీ అవినీతి పై మాట్లాడవద్దని కార్మిక సంఘాల ఎన్నికలు జరపకుండా ఎంతో ప్రతిష్టాత్మకమైన సింగరేణి మీ అవినీతి ఊబిలో చిక్కిందని కార్మికులు నాతో ఆవేదన వ్యక్తం చేశారు. నిజాం కాలంలో ప్రస్థానం మొదలై ఉమ్మడి రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగిన సింగరేణి నేడు కేసీఆర్‌ పాలనలో అప్పులు పాలై ఉద్యోగాలు పోయి బొందల గడ్డలు తయారైంది. అవినీతి పరాకాష్టగా ఉద్యోగాల రిక్రూట్‌ మెంట్‌లో ఎన్నడు లేని విధంగా హైటెక్‌ కాపీయింగ్‌ సెలక్టివ్‌ అభ్యర్ధులకు ఏకంగా పరీక్ష పత్రాలు ఇచ్చి ఉద్యోగాలు అమ్ముకుంటుంటే ఓ పెద్దాయన నాతో పాదయాత్రలో కలిసి ఇలా అన్నడు కాళోజీ నారాయణ రావు చెప్పినట్టు ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే తరిమికొట్టాలి కానీ ప్రాంతం వాడే ద్రోహం చేస్తే పాతరేయాలీ కదా కానీ మనం మనుషులం కదా బుద్ది జీవులం కదా, చైతన్యం తిరుగుబాటు తనం ఎక్కువగా ఉండే కార్మిక బిడ్డలు సింగరేణిని కేసీఆర్‌ అండ్‌ ఫ్యామిలి బీఆర్‌ఎస్‌ నేతల దోపిడీ నుంచి కాపాడాలంటే ఓట్‌ అనే ఆయుధంతో ఈ అవినీతి ప్రభుత్వాన్ని బొగ్గు బొందల్లో పాతరేయకపోతే సింగరేణి చరిత్ర పుటల్లో మాత్రమే మిగులుతుందని కార్మికులు, వారి కుటుంబాలు, కోల్‌ బెల్ట్‌ నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తుంటే నా పిడికిలి బిగుసుకుపోతుంది. సింగరేణి కార్మికుల సంఘం ఎన్నికలను తక్షణమే నిర్వహించాలి. దీనికి సంబంధించి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తుంది. పైన పేర్కొన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాం. కేసీఆర్‌ పాలనలో అవినీతి కోరల్లో చిక్కుకున్న సింగరేణిని పరిరక్షించుకోవాలనే ఆశయంతో నేను తెలంగాణ సకల జనులకు ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను. ‘ అని భట్టి విక్రమార్క లేఖ రాశారు.