భారత చైతన్య యువజన పార్టీ కేంద్ర కార్యాలయ భవనం ప్రారంభోత్సవం ఈ రోజు ఘనంగా జరిగింది. విజయవాడ గుంటూరు జాతీయ రారహదారిపక్కన ఏర్పాటు చేసిన ఈ కార్యాలయాన్ని ఉదయం 9.45 గంటలకు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు రామచంద్ర యాదవ్ ప్రారంభించారు. అనంతరం పార్టీ జెండాను కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ.. ‘రాజ్యాంగంరాసిన అంబేద్కర్ ఆశయాలు, స్వాతంత్రం తెచ్చిన గాంధీ ఆలోచనలు మన తెలుగు రాష్ట్రాల్లో మొక్కదశకు కూడా రాలేదు.. అనాదిగా అధికార ఉన్మాదంతో మదమెక్కిన రాజకీయ ఉగ్రవాదుల గుప్పిట్లో నిలువెల్లా దోపిడీకి గురవుతుంది.. మన తెలుగు రాష్ట్రాల్లో రెండు పార్టీల పాలనలో దోపిడీలు, దౌర్జన్యాలు విచ్చలవిడిగా పెరిగాయి.. వనరులను వదలడం లేదు, రైతులను బతకనీయడం లేదు, మహిళలకు భద్రత లేదు, భవితకు భరోసా లేదు, పేదలకు బతుకు లేదు, ఆస్తికి హామీలేదు!
అందుకే ఆ ఆపత్కాల ఆపదల నుండి పుట్టిన ఆలోచనలు.. ఆలోచనల నుండి వచ్చిన ఆవిష్కరణలు.. ఆవిష్కరణల నుండి పడిన అడుగులు.. ఆ అడుగుల నుండి బీజం పోసుకుని ఆత్మగౌరవానికి, అభివృద్ధికి, అవినీతిపై పోరాటానికి, ప్రజా ఉద్యమానికి నినాదమై సామాన్యుడి గొంతుకగా మారినదే మన ” భారత చైతన్య యువజన పార్టీ”! రెండు పార్టీల బాగోతాల బట్టలిప్పి.. వారి అసలు స్వరూపాన్ని ప్రజల ముందుంచి.. దోపిడీని కక్కించి, వ్యవస్థలను రక్షించి, రాజకీయ, కులాహంకార ముష్కరులను తరిమికొట్టి.. సామాన్యుడి చేతిలో అధికారం పెట్టే స్వచ్ఛమైన సుపరిపాలనకు వేదిక ఇది.. మన తెలుగు రాష్ట్రాల్లో సంప్రదాయ రాజకీయ ముష్కర మూకలకు సరైన సమాధానం చెప్పే మూడో ప్రత్యామ్నాయం మన భారత చైతన్య యువజన పార్టీ.. మన పార్టీలో సామాన్యులే పాలకులు, ప్రజలే భాగస్వాములు, యువకులే సంస్కర్తలు, రైతులే నిర్మాతలు, మహిళలే నిర్ణేతలు.’ అన్నారు.