Site icon NTV Telugu

Congress: ఇండోర్‌లో విచిత్రం.. నోటాకు ఓటేయాలని ప్రచారం.. కారణమిదే!

Nota

Nota

ఇండోర్‌లో కాంగ్రెస్‌కు విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ అభ్యర్థి చివరి నిమిషంలో తన నామినేషన్‌ను ఉపసహరించుకోవడంతో తీవ్ర భంగపాటుకు గురైంది. దీంతో బీజేపీకి గుణపాఠం చెప్పాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా నోటాకు ఓటు వేయాలని ప్రజలకు కాంగ్రెస్ ప్రచారం నిర్వహించింది. నాల్గో విడతలో భాగంగా ఇండోర్ మే 13న, సోమవారం పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో నోటా మీద నొక్కి బీజేపీకి బుద్ధి చెప్పాలని హస్తం పార్టీ పిలుపునిచ్చింది.

ఇది కూడా చదవండి: Account Minimum Balance: ఇకపై మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేదు.. ఆర్బీఐ..

ఓటర్ల పరంగా మధ్యప్రదేశ్‌లో ఇండోర్ అతిపెద్ద నియోజకవర్గం. ఇక్కడ 35 ఏళ్ల నుంచి (1989) కాంగ్రెస్ ఒక్కసారి కూడా గెలవలేదు. ఈ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెడితే.. నామినేషన్ల ఉపసంహరణ సమయంలో విత్‌డ్రా చేసుకున్నాడు. దీంతో కాంగ్రెస్‌కు గట్టి షాక్‌ తగిలినట్లైంది. ఇండోర్ నుంచి సిటింగ్‌ ఎంపీ శంకర్‌ లాల్వానీ బీజేపీ నుంచి పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్‌ నుంచి అక్షయ్‌కాంతి బామ్‌ తొలుత బరిలో నిలిచారు. కానీ చివరి నిమిషంలో పోటీ నుంచి వైదొలిగారు. తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. పార్టీకి గుడ్‌బై చెప్పి ఏకంగా ప్రత్యర్థి పార్టీలో చేరిపోయారు. దీంతో బీజేపీ అభ్యర్థితో పాటు మరో 13 మంది బరిలో నిలిచారు.

ఇది కూడా చదవండి: Ponnam Prabhakar : ఎన్నికల కోడ్ అయిపోగానే మహిళలకు మహాలక్ష్మి కింద రూ.2,500 ఇస్తాం

హస్తం గుర్తుపై ప్రత్యామ్నాయ అభ్యర్థిని బరిలో నిలపాలని కాంగ్రెస్‌ భావించినా.. అందుకు హైకోర్టు అంగీకరించకపోవడంతో ఆ పార్టీ.. అనివార్యంగా పోటీ నుంచి వైదొలగాల్సిన పరిస్థితి నెలకొంది. బరిలో ఉన్న వారెవరికీ మద్దతు ప్రకటించకుండా.. కొత్త పల్లవి అందుకుంది. బీజేపీకి బుద్ధి చెప్పాలంటే నోటాకు ఓటేయాలన్న ప్రచారం మొదలుపెట్టింది. తమ పార్టీ అభ్యర్థిని దొంగిలించిన కాషాయ పార్టీకి ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని ఆ పార్టీ రాష్ట్ర చీఫ్‌ జీతూ పట్వారీ ఓటర్లను కోరారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన బీజేపీకి దిమ్మతిరిగేలా బదులివ్వాలంటూ మరో సీనియర్‌ నేత శోభా ఓఝా పిలుపునిచ్చారు.

గతంలో ఇండోర్ స్థానం నుంచి 8 సార్లు ఎంపీగా గెలుపొందిన లోక్‌సభ మాజీ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ఈ వ్యవహారంపై స్పందించారు. చివరి నిమిషంలో పోటీ నుంచి వైదొలగడం సరికాదని పేర్కొన్నారు. ఈ విషయమై ఇండోర్‌లోని కొందరు ప్రముఖులు తనకు ఫోన్‌ చేసి బీజేపీ చేసింది తమకు నచ్చలేదని, తామూ నోటాకే ఓటేస్తామని చెప్పినట్లు ఆమె మీడియాకు చెప్పడం విశేషం. అయితే పోటీలో ఉన్నది బీజేపీ అభ్యర్థి కాబట్టి ఓటేయాలని తాను అభ్యర్థించినట్లు తెలిపారు.

దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే మూడు విడతల పోలింగ్ ముగిసింది. నాల్గో విడత సోమవారం జరగనుంది. ఇండోర్‌లో కూడా మే 13నే జరగనుంది. అనంతరం మే 20, 25, జూన్ 1న జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదలకానున్నాయి.

ఇది కూడా చదవండి: Court Shocked To School: ముఖాలు నల్లగా ఉన్నాయంటూ విద్యార్థులను బహిష్కరణ చేసిన స్కూలు యాజమాన్యం..

Exit mobile version