Bengaluru Crime: “ప్రతి నేరం వెనకా ఒక మాస్టర్‌మైండ్ ఉంటాడు.. కానీ ఆ మాస్టర్‌మైండ్ వెనక ఒక అనుచరుడో, నమ్మకస్తుడైన మిత్రుడో ఉంటాడు. కానీ.. బెంగళూరులోని కె.ఆర్. పురం పరిధిలో జరిగిన దారుణ త్రిపుల్ మర్డర్ కేసులో నిందితుడు కెన్నెత్ (25) వెనక ఉన్న ఆ నమ్మకస్తుడు గురించి షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. ఎందుకంటే ఆ సహచరుడు మనిషి కాదు.. ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్‌బాట్! వినడానికే వింతగా, ఒళ్ళు గగుర్పొడిచేలా ఉన్న ఈ నిజాన్ని చూసి బెంగళూరు పోలీసులే తీవ్ర ఆశ్చర్యానికి గురయ్యారు. జూన్ 22న తన సహజీవన భాగస్వామి శ్వేతతో కలిసి, ఆమె తల్లిదండ్రులు, చెల్లిని అత్యంత దారుణంగా హత్య చేయడానికి దాదాపు ఆరు నెలల పాటు కెన్నెత్ ప్రతి దశలోనూ ఈ ఏఐ చాట్‌బాట్ సలహాలనే తీసుకున్నాడని పోలీసుల విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఈ దారుణానికి ప్రధాన బీజం పడింది ఆర్థిక వివాదాల వల్లే. కెన్నెత్ ప్లాన్ చేసిన క్లౌడ్ కిచెన్ వ్యాపారం కోసం శ్వేత తన తల్లిదండ్రుల నుంచి దాదాపు రూ. 50 లక్షలు అప్పుగా ఇప్పించింది. అయితే ఆ డబ్బులన్నీ అయిపోవడం, మరోవైపు శ్వేత ఇంట్లో వాళ్ల నుంచి రీపేమెంట్ ఒత్తిడి తీవ్రం కావడంతో, వారిని తన మార్గానికి అడ్డుగోడగా భావించాడు కెన్నెత్. సామాజిక ఐసోలేషన్, గతంలో బ్రేక్అప్ వంటి సమస్యలతో ఉన్న కెన్నెత్‌కు శ్వేత మాత్రమే ఏకైక ఆసరాగా నిలిచింది. కానీ, ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు కెన్నెత్ ఎంచుకున్న మార్గం ఏఐతో ముడిపడిన ఒక ఘోర నేరం.
చట్టానికి చిక్కకుండా ఉండేందుకు కెన్నెత్ చాలా తెలివిగా వ్యవహరించాడు. గూగుల్ జెమిని (Google Gemini) చాట్‌బాట్‌ను నేరుగా “నేను హత్య చేయడం ఎలా?” లేదా “శవాన్ని ఎలా మాయం చేయాలి?” అని అడగలేదు. దానికి బదులుగా, “ఒకవేళ ఇలా జరిగితే నేనేం చేయాలి?”, “ఇంట్లోకి దొంగలు వస్తే వారిపై ఎలా దాడి చేయాలి?”, కళ్ళలో కారం చల్లి పొడవడానికి ఆయుధాలు ఎలా వాడాలి? అంటూ ఊహాజనిత (Hypothetical) ప్రశ్నలు వేస్తూ క్రమంగా తనకు కావలసిన సమాచారాన్ని రాబట్టుకున్నాడు. పరిశోధన కోసం అతను ఉపయోగించిన ఏకైక ఏఐ ప్లాట్‌ఫామ్ కూడా ఈ గూగుల్ జెమిని మాత్రమే.
మొదట్లో, తన క్లౌడ్ కిచెన్ వ్యాపారం కోసం తయారు చేయించిన ఐరన్ ఫర్నేస్ (ఇనుప కొలిమి)లోనే మృతదేహాలను తగలేసి మాయం చేయాలని పథకం వేశాడు. కానీ ఏఐ చాట్‌బాట్‌తో చర్చించి, లాజిస్టిక్స్ అంచనా వేసిన తర్వాత ఆ పని సాధ్యం కాదని గ్రహించి ఆ ఆలోచనను విరమించుకున్నాడు. ఆ తర్వాత ఏఐ సాయంతోనే రక్తపు మరకలను శుభ్రం చేయడం, హత్య చేసే పద్ధతులు, మృతదేహాల తరలింపు వంటి అంశాలపై ప్లాన్‌ను మరింత పదును పెట్టాడు. చివరకు జూన్ 22న పక్కా స్కెచ్‌తో శ్వేత తల్లి ముత్తులక్ష్మి (48)ని తమ అపార్ట్‌మెంట్‌కు పిలిపించి దారుణంగా పొడిచి చంపాడు. ఆ తర్వాత వేర్వేరుగా అక్కడకు వచ్చిన శ్వేత తండ్రి సోమసుందర్ (55), చెల్లెలు సుప్రియ (20)లపై కూడా విచక్షణారహితంగా దాడి చేశాడు. అయితే, శరీరం నిండా తీవ్ర గాయాలైనప్పటికీ సోమసుందర్ చావుతప్పక మెట్ల వద్దకు చేరుకుని కేకలు వేయడంతో పొరుగువారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఆసుపత్రిలో ఆయన ఇచ్చిన ‘డైయింగ్ డిక్లరేషన్’ ఈ కేసులో కీలక ఆధారంగా మారింది. హత్యల అనంతరం దంపతులిద్దరూ ఇంట్లోని నగలు, నగదు ఎత్తుకెళ్లి పుదుచ్చేరి పారిపోగా, జూన్ 24న పోలీసులు వారిని అరెస్టు చేశారు. శ్వేత కూడా ఈ దారుణంలో పూర్తిగా సహకరించినట్లు విచారణలో తేలింది.
ఈ ఘోరంపై కేసు నమోదు చేసిన బెంగళూరు పోలీసులకు డిజిటల్ దర్యాప్తు కొత్త సవాలుగా మారింది. క్రైమ్ ప్లానింగ్‌లో ఏఐ పాత్రను పూర్తి ఆధారాలతో నిరూపించడానికి కెన్నెత్ ఉపయోగించిన జెమిని చాట్ హిస్టరీని ఇవ్వాల్సిందిగా పోలీసులు గూగుల్ సంస్థకు లేఖ రాశారు. నేర పథకంలో చాట్‌బాట్‌ను ఏ స్థాయిలో ఉపయోగించాడో చెప్పడానికి విచారణాధికారులు ఒకానొక దశలో “ఈ ఏఐ చాట్‌బాట్‌ను కూడా సహ నిందితుడిగా చేర్చాలా?” అని ఆలోచించేంతగా ఈ కేసు వారిని దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే చాట్‌బాట్‌కు చట్టపరమైన బాధ్యత ఏమీ లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఏఐ ఒక డిజిటల్ సలహాదారుగా మారి నేరానికి దారితీసిన ఇలాంటి ఘటన బెంగళూరు పోలీసు చరిత్రలోనే అత్యంత అరుదైనదిగా నిలిచింది.

