మంగళవారం (జూన్ 3) రాత్రి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్ 2025 ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) విజయం సాధించి ట్రోఫీ కైవసం చేసుకుంది. అహ్మదాబాద్ నుంచి బుధవారం మధ్యాహ్నం బెంగళూరుకు చేరుకుంది. విధానసౌధ ప్రాంగణంలో ఆర్సీబీ క్రికెటర్లను సన్మానించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించడంతో.. టీమ్ బస్సు సాయంత్రం 4.30 గంటలకు అక్కడకు చేరుకుంది. అనంతరం చిన్నస్వామి స్టేడియంలో సాయంత్రం 6 గంటలకు జట్టును సన్మానించడానికి కర్ణాటక క్రికెట్ సమాఖ్య ఏర్పాటు చేసింది.
ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీ రద్దు కావడంతో అందరూ చిన్నస్వామి స్టేడియంకు చేరుకున్నారు. స్టేడియం కెపాసిటీ 35 వేలు కాగా… ఏకంగా మూడు లక్షల మందికి పైగా అభిమానులు వచ్చారు. అదే సమయంలో వర్షం పడటంతో సాయంత్రం 4 గంటల సమయంలో గేటు వద్ద తొక్కిసలాట జరిగి.. 11 మంది మృతి చెందారు. ఈ ఘటనలో 50 మందికి పైగా గాయపడ్డారు. అభిమానులు భారీ సంఖ్యలో పోటెత్తడంతో పోలీసులు చేతులెత్తేశారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా వేడుకలు వాయిదా వేయాలని పోలీసులు సూచించినా.. ఆర్సీబీ యాజమాన్యం నిర్వహణకే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
Also Read: Hero Vishal: హీరో విశాల్‌కు బిగ్ షాక్.. 30 శాతం వడ్డీతో 21 కోట్లు చెల్లించాలంటూ..!
వేడుకలు, ర్యాలీ వద్దని ఆర్సీబీ యాజమాన్యంకు ఓ పోలీసు అధికారి తెలిపినట్లు ఓ జాతీయ మీడియా తమ కథనంలో పేర్కొంది. ‘బుధవారం వేడుకలు, ర్యాలీ వద్దని ఆర్సీబీ యాజమాన్యం, ప్రభుత్వానికి మంగళవారం రాత్రే సూచించాం. ప్రస్తుతం అభిమానులు తీవ్ర ఉద్వేగంతో ఉన్నారని, కాస్త చల్లబడిన తర్వాత వేడుకలు పెట్టుకోవాలని విజ్ఞప్తి చేశాం. ర్యాలీ వద్దని, ఒక ప్రాంతంలో వేడుకలు నిర్వహించాలని సూచించాం. విదేశీ క్రికెటర్లు అందుబాటులో ఉండరని ఆర్సీబీ యాజమాన్యం కార్యక్రమం నిర్వహణకే మొగ్గు చూపింది’ అని సదరు పోలీసు అధికారి చెప్పారు. పోలీసు అధికారి మాటలను బట్టి చూస్తే.. ఆర్సీబీ యాజమాన్యం తొందరపాటు కారణంగానే విషాదం నెలకొందని స్పష్టమవుతోంది.