Cameras on Vegetable Vendors: కూరగాయల మార్కెట్‌లో AI కలకలం.. వ్యాపారుల తలపై వింత గ్యాడ్జెట్లు.. అసలేం జరుగుతోంది?

Ai Using

Ai Using

Cameras on Vegetable Vendors: ప్రస్తుతం అంతా AI కాలం నడుస్తోంది. బెంగళూరులోని ప్రముఖ KR మార్కెట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఎప్పుడూ పూలు, కూరగాయల వ్యాపారాలతో రద్దీగా ఉండే ఈ మార్కెట్‌లో తాజాగా ఓ వింత దృశ్యం కనిపించింది. పూలు, కూరగాయలు అమ్మే వ్యాపారులు తలపై కెమెరాలు ధరించి తమ రోజువారీ పనులు చేసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అసలు అక్కడ ఏం జరుగుతోందనే ఆసక్తి నెలకొంది.

ఆ వీడియోలో కొందరు వ్యాపారులు తలపై ప్రత్యేక కెమెరాలను ధరించి పూలు, కూరగాయలు విక్రయిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ పరికరాలు వారి కదలికలు, వస్తువులను చేతబట్టే విధానం, కస్టమర్లతో మాట్లాడే తీరు వంటి రోజువారీ కార్యకలాపాలను రికార్డ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కెమెరాలు ధరించినప్పటికీ వ్యాపారులు తమ సాధారణ పనులను చేసుకుంటున్నారు. అయితే ఈ కెమెరాల వెనుక అసలు ఉద్దేశం ఏమిటనేది సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఇవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత హ్యూమనాయిడ్ రోబోలకు శిక్షణ ఇచ్చేందుకు ఉపయోగించే మోషన్ క్యాప్చర్ పరికరాలు అయి ఉండొచ్చని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మనుషులు రోజువారీ పనులు ఎలా చేస్తారు? వస్తువులను ఎలా పట్టుకుంటారు? కస్టమర్లతో ఎలా వ్యవహరిస్తారు? వంటి అంశాలను రికార్డ్ చేసి, ఆ డేటా ఆధారంగా రోబోలకు శిక్షణ ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఈ ఫొటోలు, వీడియోలు వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. భవిష్యత్తులో రోబోలే కూరగాయలు అమ్ముతాయా? అంటూ ఓ యూజర్ సరదాగా ప్రశ్నించారు. మరో నెటిజన్ ఈ పరికరాలు ధరించగలిగే మోషన్ క్యాప్చర్ టెక్నాలజీకి సంబంధించినవని వివరించారు. మనుషుల చిన్న చిన్న కదలికలను కూడా రికార్డ్ చేసి, హ్యూమనాయిడ్ రోబోలు అదే విధంగా పనిచేసేలా శిక్షణ ఇవ్వడానికి ఈ డేటా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. మరోవైపు ఈ పరిణామంపై కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కొద్దిపాటి డబ్బు కోసం కార్మికుల నుంచి వారి పనులకు సంబంధించిన డేటాను సేకరించి, భవిష్యత్తులో అదే పనులను రోబోలతో చేయిస్తే మానవ ఉపాధికి ప్రమాదం ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. మరికొందరు అయితే వ్యాపారులు కస్టమర్లను ఆకర్షించేందుకు చేసే ప్రత్యేక అరుపులను కూడా ఈ కెమెరాలు రికార్డ్ చేస్తున్నాయేమోనని సరదాగా కామెంట్లు చేస్తున్నారు.