ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజ్యసభ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. టీడీపీ-వైసీపీ పోటాపోటీగా వ్యూహాలు పన్నుతున్నాయి. ప్రస్తుతం ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్యసభ సభ్యులు సి.ఎం. రమేష్, కనకమేడల రవీంద్ర కుమార్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పదవీ కాలం ఏప్రిల్ లో ముగియనుంది. ఈ మూడింటికి మూడు దక్కించుకోవాలని వైసీపీ వ్యూహం పన్నుతుంటే.. అందులో ఒక్కటైనా దక్కించుకోవాలని టీడీపీ చూస్తోంది. సీటు గెలుచుకోవడానికి మ్యాజిక్ ఓట్ల సంఖ్యపై ఆసక్తికర చర్చ జరుగుతుంది.
ఇదే సమయంలో నలుగురు వైసీపీ రెబల్స్, మరో నలుగురు టీడీపీ రెబల్స్ అనర్హత పిటిషన్లు ఈరోజు స్పీకర్ ముందుకొచ్చాయి. కాగా.. వీరిపై వేటుపడితే ఓట్ల లెక్కలు తారుమారుకానున్నాయి. వీటికి తోడు వైసీపీ సీట్లు ఇవ్వని ఎమ్మెల్యేలు ఏం చేస్తారన్నది ఉత్కంఠగా మారింది. ఒక్క రాజ్యసభ సీటు గెలవాలంటే దాదాపు 44 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి. ఈ లెక్క ప్రకారం.. మూడు వైసీపీ ఖాతాలో పడతాయి.. కానీ, టీడీపీ పోటీ పెడితే ఆ పార్టీ అభ్యర్థికి వైసీపీ అసంతృప్తి ఎమ్మె్ల్యేలు ఎవరైనా మద్ధతిస్తే ఫలితాలు తారుమారు అవుతాయి.
Read Also: Terror Group SIMI: ఉగ్రవాద సంస్థ సిమిపై మరో ఐదేళ్ల పాటు నిషేధం పొడిగింపు
గతేడాది జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క సీటు చేజార్చుకున్న వైసీపీ.. ఈసారి ఆ తప్పు దొర్లకుండా ఉండేందుకు ముందుగానే అలర్ట్ అయింది. ఇప్పటికే వైసీపీ అధిష్టానం అభ్యర్థులను దాదాపు ఖరారు చేసింది. పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాపురావు, చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసరావు, వైవీ సుబ్బారెడ్డి పేర్లును వైసీపీ దాదాపు ఖరారు చేసింది. అయితే పార్టీకి అసంతృప్తి ఎమ్మె్ల్యేల టెన్షన్ పట్టుకుంది. ఇటీవలే మార్పులు-చేర్పులు భాగంగా కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీటు నిరాకరించింది వైసీపీ అధిష్టానం. కొందరు అసంతృప్తి ఎమ్మె్ల్యేలు ఇప్పటికే ఇతర పార్టీలతో టచ్ లోకి వెళ్లారు. అయితే పార్టీ ఫిరాయించకుండా ఉండి చివరి నిమిషంలో విప్ దిక్కరిస్తే పరిస్థితి ఏందనే ఆందోళనలో ఉంది వైసీపీ.
ఇటు టీడీపీ ఒక్కసీటు గెలుస్తామనే ధీమాతో ఉంది. ఇప్పటికే ఇద్దరి పేర్లను పరిశీలిస్తోంది. వర్ల రామయ్య, కోనేరు సురేష్ పేర్లను పరిశీలిస్తోంది. మాజీ రాజ్యసభ సభ్యులు కూడా టీడీపీతో టచ్ లోకి వచ్చారని సమాచారం తెలుస్తోంది. ఈ ఊపుతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో లాగే, రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీకి ఝలక్ ఇస్తామని అంటుంది టీడీపీ. కాగా.. రాజ్యసభ స్థానం దక్కాలంటే 43 ఎమ్మెల్యేల మద్ధతు అవసరమని టీడీపీ అంచనా వెస్తోంది. ప్రస్తుతం వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి టీడీపీ బలం 23కు చేరింది. రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే.. ఆ సంఖ్య 19కు చేరుతుంది. వైసీపీ రెబల్స్ పై అనర్హత వేటు పడితే దాదాపు 25 మంది ఎమ్మెల్యేల మద్ధతు అవసరమని లెక్కలు వేసుకుంటుంది. అయితే ఇప్పటికే 50 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని టీడీపీ చెబుతుంది. వైసీపీ అసంతృప్తి ఎమ్మె్ల్యేలే తమను గెలిపిస్తారని పేర్కొంటుంది.
