గత ఏడాది స్వదేశంలో జరిగిన న్యూజిలాండ్ సిరీస్, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో టీమిండియా పేలవ ప్రదర్శన తర్వాత భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. టీమిండియా పర్యటనల్లో క్రికెటర్ల కుటుంబ సభ్యుల బసపై బీసీసీఐ ఆంక్షలు విధించనుంది. విదేశీ పర్యటనల్లో కుటుంబ సభ్యులతో ప్లేయర్ వెచ్చించే సమయం, ప్రయాణాల విషయంలో కఠినమైన నిబంధనలు అమలు చేయాలని బీసీసీఐ భావిస్తోంది.
బీసీసీఐ నిబంధనలు అమల్లోకి వస్తే.. 45 రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం పర్యటనల్లో భాగస్వామి, పిల్లలు 14 రోజుల కంటే ఎక్కువగా క్రికెటర్లతో ఉండటానికి వీల్లేదు. పర్యటనలో మొదటి రెండు వారాలు కుటుంబ సభ్యులకు అనుమతి లేదు. 45 రోజుల కంటే కాలం పర్యటనల్లో కుటుంబ సభ్యులు గరిష్టంగా వారం రోజులు మాత్రమే ఉండాలి. ప్రాక్టీస్, మ్యాచ్‌ల సమయంలో ప్లేయర్స్ ఎవరైనా సరే వ్యక్తిగతంగా కాకుండా.. జట్టు బస్సులోనే ప్రయాణించాలి. ఈ నిబంధనలు ఆటగాళ్ల ఒప్పందాల్లో ఉన్నప్పటికీ.. కరోనా వైరస్ సమయంలో సడలింపులు ఇచ్చారు. ఇప్పుడు మరలా వాటిని అమలు చేయనున్నారు.
Also Read: Formula E Case: ఫార్ములా-ఈ రేస్ కేసు.. నేడు ఈడీ విచారణకు కేటీఆర్!
ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ 3-1తో సిరీస్ ఓడిన విషయం తెలిసిందే. ఇటీవలి కాలంలో టీమిండియా ప్రదర్శన ఏమంత గొప్పగా లేదు. దాంతో శనివారం ముంబైలోని బీసీసీఐ కార్యాలయంలో కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ కోచ్ గౌతమ్ గంభీర్, సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్‌తో బోర్డు అధికారులు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆటగాళ్ల ప్రదర్శనపై సమీక్షతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మునుపటి నిబంధనల అమలు గురించి బోర్డు అధికారులు కెప్టెన్, కోచ్‌కు సమాచారం అందించారు. అయితే పర్యటనల్లో కుటుంబ సభ్యుల వసతి నిబంధనలో ఎలాంటి మార్పు ఉండదని బోర్డు వర్గాలు తెలిపాయి. పర్యటనల్లో కుటుంబ సభ్యుల ప్రయాణ ఖర్చుల్ని క్రికెటర్లు సొంతంగా పెట్టుకుంటారన్న విషయం తెలిసిందే.