Site icon NTV Telugu

Mohsin Naqvi-BCCI: ఖబర్దార్, ఇక చూసుకుందాం.. మోసిన్‌ నఖ్వీకి బీసీసీఐ వార్నింగ్‌!

Mohsin Naqvi Bcci

Mohsin Naqvi Bcci

ఇటీవలే దాయాది పాకిస్థాన్‌ను ఓడించిన భారత జట్టు ఆసియా కప్ 2025ను గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ విజయం తర్వాత భారత జట్టు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) చీఫ్, పీసీబీ అధ్యక్షుడు మోసిన్‌ నఖ్వీ నుంచి ట్రోఫీని స్వీకరించడానికి టీమిండియా నిరాకరించింది. దాంతో ఫైనల్ రోజు నఖ్వీ ట్రోఫీతో దుబాయ్‌లోని ఒక హోటల్‌కు వెళ్ళాడు. పాకిస్తాన్‌కు బయలుదేరే ముందు ట్రోఫీని ఏసీసీ కార్యాలయంలో ఉంచాడు. నఖ్వీ ట్రోఫీని భారత జట్టుకు ఇవ్వడానికి నిరాకరించాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ ఏసీసీ కార్యాలయానికి వచ్చి ట్రోఫీని తీసుకోవాలని షరతు పెట్టాడు.

ఆసియా కప్ 2025 ఫైనల్ ముగిసిన తర్వాత జరిగిన ఏసీసీ ఏజీఎం సమావేశంలో మోసిన్‌ నఖ్వీ తీరుపై బీసీసీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. ట్రోఫీ, మెడల్స్‌ను వెంటనే అప్పగించాలని డిమాండ్ చేసింది. అయినా కూడా పీసీబీ చీఫ్ వెనక్కి అగ్గడం లేదు. ఫైనల్ ముగిసి దాదాపు నెల కావొస్తున్నా.. ట్రోఫీ, మెడల్స్‌ భారత జట్టు చేతికి రాలేదు. దాంతో తాజాగా నఖ్వికి బీసీసీఐ వార్నింగ్ ఇచ్చింది. ట్రోఫీని సరైన పద్ధతిలో అప్పగించాలని, లేకపోతే ఐసీసీకి ఫిర్యాదు చేస్తామని నఖ్వికి పంపిన అధికారిక ఇ-మెయిల్లో హెచ్చరించింది. నఖ్వి నుంచి ఎటువంటి స్పందన రాకపోతే ఐసీసీకి ఫిర్యాదు తెలియజేస్తామని బీసీసీఐ కార్యదర్శి దేవ్‌జిత్ సైకియా ఓ ప్రకటనలో తెలిపారు.

Also Read: iQOO 15 Launch: 7000mAh బ్యాటరీ, మూడు 50MP కెమెరాలు.. అత్యంత శక్తివంతమైన ‘ఐకూ 15’ ఫుల్ ఫీచర్స్ ఇవే!

దేవ్‌జిత్ సైకియా ఇండియా టుడేతో మాట్లాడుతూ… ‘భారత జట్టుకు ట్రోఫీని అందజేయాలని మేము ఏసీసీకి లేఖ రాశాము. వారి ప్రతిస్పందన కోసం మేము ఎదురుచూస్తున్నాము. పీసీబీ చీఫ్ నుంచి ఎటువంటి స్పందన రాకపోతే మేము ఐసీసీకి లేఖ రాస్తాము. మేము దశల వారీగా ముందుకు సాగుతున్నాము’ అని చెప్పారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో మోసిన్‌ నఖ్వీ చేతుల మీదుగా ఎట్టిపరిస్థితుల్లో ట్రోఫీని స్వీకరించబోమని బీసీసీఐ స్పష్టం చేసింది. ఏసీసీ కార్యాలయంలో ట్రోఫీ అందజేయానికి తాను సిద్ధం అని నఖ్వీ పట్టుబడుతున్నాడు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Exit mobile version