NTV Telugu Site icon

Team India Coach: బీసీసీఐకి ఘోర అవమానం.. టీమిండియా హెడ్ కోచ్ పదవికి ఒకటే దరఖాస్తు!

Bcci

Bcci

Gautam Gambhir is set to be selected as Team India Head Coach: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి ఘోర అవమానం ఎదురైంది. బీసీసీఐ చేసిన టీమిండియా హెడ్ కోచ్ ప్రకటనపై ఎవరూ ఆసక్తి చూపలేదు. హెడ్ కోచ్ కోసం ఒకే ఒక్క దరఖాస్తు వచ్చిందని ఓ జాతీయ మీడియా తమ కథనంలో పేర్కొంది. టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మాత్రమే కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకున్నాడట. ఈ విషయం తెలిసిన క్రికెట్ ఫాన్స్ ఒక్కసారిగా అవాక్కవుతున్నారు.

టీ20 ప్రపంచకప్‌ 2024తో రాహుల్ ద్రవిడ్‌ పదవీకాలం ముగియనుంది. కోచ్‌గా కొనసాగడానికి ద్రవిడ్‌ విముఖతను వ్యక్తం చేయడంతో 2024 మే మొదటి వారంలో బీసీసీఐ దరఖాస్తుదారులను ఆహ్వానించింది. దరఖాస్తులకు మే 27 చివరి తేదీగా ప్రకటించింది. హెడ్ కోచ్ ప‌ద‌వీకాలం మూడున్నర సంవత్సరాలు (2024 జులై 1 నుంచి 2027 డిసెంబ‌ర్ 31వ తేదీ వ‌ర‌కు) ఉంటుందని, నూతన కోచ్ వ‌న్డే ప్రపంచ‌క‌ప్ 2027 వ‌ర‌కు కొన‌సాగుతాడని పేర్కొంది. కోచ్‌ రేసులో స్టీఫెన్ ఫ్లెమింగ్, జస్టిన్‌ లాంగర్, రికీ పాంటింగ్‌, గౌతమ్ గంభీర్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అయితే దేశవాళీ క్రికెట్‌పై మంచి అవగాహన ఉన్నవాళ్లనే కోచ్‌గా ఎంపిక చేస్తామని బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జై షా స్పష్టం చేయడంతో ఆ వార్తలకు బ్రేక్‌లు పడ్డాయి.

Also Read: Azmatullah Omarzai: ఒకే ఓవర్‌లో 36 పరుగులు.. రెండో చెత్త బౌలర్‌గా ఒమర్జాయ్ రికార్డు!

చివరకు గౌతమ్ గంభీర్ మాత్రమే కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకున్నాడని తాజాగా తెలిసింది. గంభీర్‌ను నేడు క్రికెట్ అడ్వైజరీ కమిటీ ఇంటర్వ్యూ చేయనుంది. జూమ్ కాల్ ద్వారా గంభీర్‌తో కమిటీ సభ్యులు మాట్లాడనున్నారు. అశోక్ మల్హోత్రా, జతిన్ పరంజపే, సులక్షణ నాయక్‌లు గంభీర్‌ను ఇంటర్వ్యూ చేయనున్నారు. ఇక గౌతీ ఎంపిక లాంచనమే. మిగతా బోర్డుల కంటే సాలరీ, అలవెన్స్‌లు బీసీసీఐ ఎక్కువగా ఇస్తున్నా.. ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం. అధిక పని ఒత్తిడే ఇందుకు కారణముగా తెలుస్తోంది. టీమిండియా హెడ్ కోచ్ 10 నెలలు పని చేయాల్సి ఉంటుంది.

Show comments