Bangladesh Ex-Captain Mashrafe Mortaza House Burned: రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనల నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేశారు. సోమవారం ప్రధాని పదవికి రాజీనామా చేసిన హసీనా.. దేశం విడిచి ఉన్నపళంగా భారత్‌కు వచ్చారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో గల హిండన్ ఎయిర్‌బేస్‌లో తలదాచుకుంటున్నారు. సైనికాధిపతి జనరల్ వకార్-ఉజ్-జమాన్ నేతృత్వంలో బంగ్లాలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది.
షేక్ హసీనా భారత్‌కు వచ్చాక బంగ్లాదేశ్‌లో మరింత విధ్వంసకర పరిణామాలు చోటు చేసుకున్నాయి. హసీనాకు చెందిన అధికారిక నివాసాన్ని ఆందోళనకారులు స్వాధీనం చేసుకున్నారు. నివాసంలోకి ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. వంట వండుకుని తిని.. బెడ్ మీదే పడుకున్నారు. విలువైన వస్తువులను తమ వెంట పట్టుకెళ్లారు. అక్కడితో ఆగకుండా ఆవామీ లీగ్ పార్టీ ఎంపీ, బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ మష్రఫే మోర్తజా నివాసాన్ని కూడా ధ్వంసం చేశారు. ముందుగా దాడి చేసిన ఆందోళనకారులు.. విలువైన వస్తువులను చోరీ చేశారు. ఆపై బంగళాను తగులబెట్టారు. ఇందుకు సంబందించిన వీడియోస్, ఫొటోస్ నెట్టింట వైరల్ అయ్యాయి.
Also Read: Paris Oympics 2024: కునుకు తీసింది.. గోల్డ్ మెడల్ కొట్టింది! వీడియో వైరల్
మష్రఫే మోర్తజా క్రికెట్‌లో కొనసాగుతుండగానే.. 2018లో ఆవామీ లీగ్ పార్టీలో చేరారు. నరైల్-2 నియోజకవర్గానికి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నారు. బంగ్లా తరఫున 36 టెస్టులు, 220 వన్డేలు, 54 టీ20లు ఆడారు. మూడు ఫార్మాట్లలో కలిపి 390 వికెట్లు పడగొట్టిన మోర్తజా.. 2,955 పరుగులు చేశారు. 117 మ్యాచ్‌లల్లో బంగ్లా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. ప్రపంచకప్ 2019లో ఆడిన బంగ్లాదేశ్ జట్టుకు అతనే సారథి.