Bangladesh: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో మరోసారి భారీ నిరసనలు చెలరేగాయి. తీవ్రవాద భావజాలం, భారత్‌కు వ్యతిరేక వ్యాఖ్యలు చేసే నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాది మరణించారు. అనంతరం.. వేలాది మంది షాబాగ్ ప్రాంతంలో గుమిగూడారు. నినాదాలు చేస్తూ, ప్లకార్డులు పట్టుకుని నిరసనకారులు హాది భద్రతలో అధికారుల వైఫల్యమే కారణమని ఆరోపించారు. నిరసనలు క్రమంగా ఉద్రిక్తంగా మారాయి. ఆగ్రహంతో కొందరు నిరసనకారులు దేశంలోని అతిపెద్ద పత్రిక అయిన ‘డైలీ ప్రథమ్ ఆలో’ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. ప్రథమ్ ఆలో, డైలీ స్టార్ కార్యాలయాలు ఉన్న భవనంలో పలువురు చిక్కుకుపోయారు. మొదట ఆఫీసులను ధ్వంసం చేసిన నిరసనకారులు, ఆ తర్వాత వాటికి నిప్పు పెట్టారు. ఆ భవనాల వద్ద సైనికులు, సరిహద్దు భద్రతా బలగాలు మోహరించినప్పటికీ.. నిరసనకారులను చెదరగొట్టలేదు. భద్రతా సిబ్బంది శాంతియుతంగా వెళ్లిపోవాలని వారిని ఒప్పించే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో అగ్నిమాపక సిబ్బంది డైలీ స్టార్ భవనం వద్దకు చేరుకున్నారు. హాది మరణ వార్త వెలువడిన తర్వాత చిట్టగాంగ్‌లోని భారత ఉప హైకమిషనర్ నివాసం వద్ద సైతం నిరసనకారులు చెలరేగాయి. భారత రాయబార కార్యాలయంపైకి నిరసనకారులు రాళ్లు విసిరారు. గురువారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఖుల్షీ ప్రాంతానికి చేరుకున్న నిరసనకారులు హాదిని హత్య చేశారంటూ.. అవామీ లీగ్, భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
READ MORE: Jinn : షూటింగ్ సెట్‌లో వింత అనుభవాలు.. భారీ కారు ప్రమాదం!
అసలు షరీఫ్ ఉస్మాన్ హాదికి ఏమైంది?
హాది సింగపూర్‌లో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ ధృవీకరించింది. డిసెంబర్ 12న ఢాకాలోని బిజోయ్‌నగర్ ప్రాంతంలో ప్రచారం చేస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు తలపై కాల్పులు జరిపారని తెలిపింది. తీవ్రంగా గాయపడిన హాదిని మెరుగైన చికిత్స కోసం సింగపూర్‌కు తరలించారు. అయితే ఆయన అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ మరణవార్త విన్న అనంతరం ఢాకాలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఈ ఉద్రిక్త పరిస్థితుల మధ్య… తాత్కాలిక ప్రధాని మహమ్మద్ యూనస్ శాంతి పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని కోరారు. శుక్రవారం జాతీయ సంతాప దినంగా ప్రకటించి, దేశవ్యాప్తంగా మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ “హేయమైన హత్య”కు బాధ్యులైన వారిని వదిలిపెట్టబోమని యూనస్ హెచ్చరించారు.
