Bandla Ganesh: సినీ నిర్మాత బండ్ల గణేష్ తెలంగాణలోని హనుమకొండలో పర్యటించి తన ఉదారత్వాన్ని చాటుకున్నారు. హనుమకొండలోని హనుమాన్ నగర్‌కు చేరుకున్న ఆయన.. అక్కడ అరుదైన వ్యాధితో తీవ్ర అనారోగ్యానికి గురై బాధపడుతున్న చిన్నారి నిరంజన్ నివాసానికి వెళ్లి ఆ బాబును ప్రత్యేకంగా పరామర్శించారు. నిరంజన్‌తో ఎంతో ఆప్యాయంగా మాట్లాడి, అతని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అధైర్యపడొద్దని, గుండె నిబ్బరంతో ఉండాలని ఆత్మస్థైర్యం నింపారు. నిరంజన్ తల్లిదండ్రులు రాంగోపాల్ చారి, మానసలకు తామున్నామనే కొండంత భరోసా ఇస్తూ, ఆ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
ఈ పరామర్శ సందర్భంగా బండ్ల గణేష్ తన పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్ తరఫున రూ. 5 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించి, దానికి సంబంధించిన చెక్కును చిన్నారి తల్లిదండ్రులకు అందజేశారు. ఈ ఐదు లక్షల రూపాయలను బాలుడి భవిష్యత్తు కోసం అతని పేరు మీదనే ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని తల్లిదండ్రులకు సూచించారు. అయితే, ఆ అమాయక చిన్నారి నిరంజన్ మాత్రం.. తనకు కారు కొనుక్కోవాలని ఉందని, కారులో తిరగాలన్నదే తన కోరిక అని బండ్ల గణేష్‌తో చెప్పడం అక్కడ ఉన్నవారిని కదిలించింది. ఈ సందర్భంగా నిర్మాత బండ్ల గణేష్ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నాకు దైవసమానులైన పవన్ కళ్యాణ్ నిరంజన్‌ను పరామర్శించినప్పుడే ఈ బాబు పరిస్థితి నా దృష్టికి వచ్చింది. పవన్ కళ్యాణ్ భక్తుడిగా, ఆయన చూపిన సేవా స్ఫూర్తితోనే నా వంతు ఉడతా భక్తిగా ఈ సహాయం చేయడానికి ముందుకు వచ్చాను. మేము ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి పవన్ కళ్యాణ్ దయే కారణం. ప్రస్తుతం నా కుమార్తె పెళ్లి పనులతో అత్యంత బిజీగా ఉన్నప్పటికీ, ఎలాగైనా వచ్చి ఈ రోజే నిరంజన్ కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. అందులోనూ ఈ రోజు నారా భువనేశ్వరి జన్మదినం కావడం విశేషం. ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ ఐదు లక్షల చెక్కును నిరంజన్ కుటుంబానికి అందించడం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తోంది. ఇక్కడికి నేను కేవలం బాబును చూసి సహాయం చేయడానికి మాత్రమే వచ్చాను, ఇప్పుడు ఎలాంటి రాజకీయాలు మాట్లాడను. నిరంజన్ త్వరగా కోలుకుని పూర్తి ఆరోగ్యంతో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని బండ్ల గణేష్ వ్యాఖ్యానించారు.

