NTV Telugu Site icon

Bandi Sanjay: ఫోర్త్ సిటీ వెనుక భూదందా.. వేల ఎకరాలను సేకరించి దోచుకునే కుట్ర

Bandi Sanjay

Bandi Sanjay

కాంగ్రెస్ ప్రభుత్వం ‘ఫోర్త్ సిటీ’ పేరుతో చేసిన ప్రకటన వెనుక పెద్ద ఎత్తున భూదందా కొనసాగుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ నేతలు వేల ఎకరాలను ముందుగానే సేకరించి.. రియల్ ఎస్టేట్ దందా చేస్తూ వేల కోట్ల ఆస్తులను పోగేసుకునేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. ధరణి పేరుతో దాదాపు రూ.2 లక్షల కోట్ల స్కాం జరిగిందని పేర్కొన్నారు. దేశంలోనే అతిపెద్ద స్కాం ధరణి అని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నేతలు కూడా బీఆర్ఎస్ బాటలో నడుస్తూ.. వేల కోట్ల ఆస్తులను దోచుకునేందుకు సిద్ధమైందన్నారు. ఈరోజు మహేశ్వరం నియోజకవర్గంలోని గుర్రంగూడలో బోనాల ఉత్సవాలకు హాజరైన బండి సంజయ్, చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు.

Waqf Board: వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకి కేబినెట్ ఆమోదం?.. కేంద్రంపై ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

బోనాల పండుగ వెనుక పెద్ద చరిత్ర ఉంది.. బోనం పండుగకు సైంటిఫిక్ రీజన్ కూడా ఉందని బండి సంజయ్ తెలిపారు. కానీ ఇంత పెద్ద పండుగకు ప్రభుత్వం నిధులివ్వదని ఆరోపించారు. హిందువుల పండుగలకు పైసలివ్వరు.. సెక్యులరిజం పేరుతో ఒక మతానికే కొమ్ముకాస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం కోట్లు ఖర్చు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రంజాన్ కు రూ.33 కోట్లు, హిందువులను చంపిన తబ్లిగీ జమాతే సంస్థకు 2 కోట్ల 40 లక్షలు విడుదల చేసిన కాంగ్రెస్ అదేదో ఘన కార్యంగా చెప్పుకోవడం సిగ్గు చేటు అని దుయ్యబట్టారు. హిందువుల పండుగలంటే అంత చులకనా..?అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ మాదిరిగానే కాంగ్రెస్ కూడా ఎంఐఎం పార్టీకి కొమ్ము కాస్తోందని అన్నారు. ఇట్లనే వ్యవహరిస్తే బీఆర్ఎస్ కు పట్టిన గతే కాంగ్రెస్ కు పట్టడం ఖాయమని తెలిపారు. ఎంఐఎం పార్టీని నమ్ముకుంటే కాంగ్రెస్ నేతలు నట్టేట మునగడం ఖాయం.. 15 నిమిషాలపాటు సమయమిస్తే హిందువులను నరికి చంపుతానన్న అక్బరుద్దీన్ ఒవైసీని తీసుకెళ్లి కొడంగల్ లో పోటీ చేయిస్తామని కాంగ్రెస్ నేతలు ప్రతిపాదించడం సిగ్గు చేటని పేర్కొన్నారు.

Paris Olympics 2024: క్వార్టర్ ఫైనల్లో భారత బాక్సర్ లవ్లీనా ఓటమి..

మహేశ్వరంను ఫోర్త్ సిటీగా మారుస్తామనే సర్కార్ ప్రకటన వెనుక పెద్ద భూదందా నడుస్తోందని బండి సంజయ్ ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు వేల ఎకరాలను అగ్గువకు కొని ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ మాదిరిగానే భూదందాతో వేల కోట్ల ఆస్తులను పోగేసుకునేందుకు ఫోర్త్ సిటీ అంశాన్ని తెరపైకి తెస్తున్నారని అన్నారు. దీనివల్ల కాంగ్రెస్ నేతలకు తప్ప ప్రజలకు పెద్దగా ప్రయోజనం లేదన్నారు. పెద్ద ఎత్తున ఆస్తులు సంపాదించేందుకు భూ దందాను తెరపైకి తేవడమే కాకుండా.. మహేశ్వరం కాంగ్రెస్ స్థానిక కాంగ్రెస్ నాయకుడికే భూములను సేకరించే బాధ్యతను అప్పగించారని బండి సంజయ్ తెలిపారు.