NTV Telugu Site icon

Telangana: బండి కొంప ముంచిది అదే.. కిషన్‌రెడ్డికి కలిసి వచ్చింది ఇదే..!

Ts Bjp

Ts Bjp

Telangana: తెలంగాణ బీజేపీ పగ్గాలు చేతులు మారాయి.. ఆ పార్టీ సీనియర్ నేత కిషన్ రెడ్డి చేతికి అధ్యక్ష బాధ్యతలు వచ్చాయి. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి అయితే పార్టీని గాడిన పెట్టగలరని అధిష్ఠానం నమ్మింది. బండి సంజయ్ ఏకపక్ష పోకడలు కూడా ఆయన అధ్యక్ష పదవికి ఎసరు తెచ్చినట్టుగా కనిపిస్తోంది. కిషన్ రెడ్డి బీజేపీలో సీనియర్‌ నాయకుడు. 1964లో రంగారెడ్డి జిల్లా తిమ్మాపురం గ్రామంలో జన్మించిన కిషన్ రెడ్డి సాధారణ కార్యకర్తగా పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. మూడు దశాబ్దాల కింద అమెరికాకు వెళ్లిన బీజేపీ టీంలో కిషన్ రెడ్డి ఒకరు. అదే బృందంలో నేటి ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఉన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి గతంలోనూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు.

2010-14 మధ్య ఉమ్మడి ఏపీకి, 2014-16 మధ్య తెలంగాణకు బీజేపీ అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి బాధ్యతలు నిర్వర్తించారు. 2016-18 మధ్య శాసనసభాపక్ష నేతగా వ్యవహరించారు. అనంతరం 2019 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. అధిష్ఠానం తీసుకున్న తాజా నిర్ణయంతో ఇకపై ఆయన తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు నిర్వహించనున్నారు. ఇక, తెలంగాణ బీజేపీలో అధ్యక్షుడి మార్పు ఊహించిందే. తెలంగాణ బీజేపీ చీఫ్‌ పదవికి కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ రాజీనామా చేశారు. ఢిల్లీలో పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అనంతరం ఆయన ఈ నిర్ణయం ప్రకటించారు.

అధ్యక్ష పదవికి రాజీనామా చేయగానే తన ట్విట్టర్ అకౌంట్ లో హోదా మార్చుకున్నారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి స్థానంలో బీజేపీ కార్యకర్త అని పేర్కొన్నారు. బండి సంజయ్ పై ఉన్న ప్రధాన విమర్శ నోటి దురుసు. తొందరగా మాట జారేయడం, దాన్ని వెనక్కి తీసుకోలేక.. ఇబ్బంది పడడం. ఆయనపై ఉన్న మరో ఆరోపణ నాయకత్వ లోపం. క్యాడర్ ను బాగా చూసుకుంటాడని మంచి పేరున్నా.. చుట్టూ ఉన్న నేతలను కలుపుకుని పోలేరని అంటారు. బండి సంజయ్ కు ఉన్న మరో బలహీనత కార్పోరేట్ పాలిటిక్స్ అలాగే ఢిల్లీ పాలిటిక్స్ గురించి పూర్తి ఔపాసన పట్టకపోవడం. మాస్ లీడర్ గా ఎదిగే క్రమంలో క్లాస్ ను మరిచిపోవడం వల్ల బండి సంజయ్ పడ్డ కష్టానికి సరైన ఫలితం దక్కలేదంటారు ఆ పార్టీ నాయకులు.

ఇటు కిషన్ రెడ్డికి అనుభవం, విధేయతతో పాటు వివాద రహితుడనే ట్యాగ్ కూడా కలిసొచ్చింది. అయితే ఇప్పుడు కిషన్ రెడ్డి కూడా కొన్ని సవాళ్లు అధిగమించాల్సి ఉంది కేసీఆర్ తో అనుబంధం ఉందనే వాదనను తిప్పికొట్టడంతో పాటు.. వ్యక్తిగత సత్తా ఏంటో చాటాల్సిన అవసరం కనిపిస్తోంది. బండి సంజయ్ కి మించిన దూకుడు చూపిస్తూనే.. పార్టీలో మరింత మంది నేతలు చేరేలా చొరవ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది.