NTV Telugu Site icon

Bandi Sanjay : సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ

Bandi Sanjay Group1

Bandi Sanjay Group1

పంతాలు.. పట్టింపులకు పోకుండా 29 జీవోను ఉపసంహరించుకోవాలని, రేపు పరీక్షలని తెలిసి కూడా ఈరోజు కూడా ఆందోళనను కొనసాగిస్తున్నారంటే అర్ధం చేసుకోండి, నిరుద్యోగులంతా మీ కుటుంబ సభ్యులుగా భావించి వారి ఆవేదనను అర్ధం చేసుకోండి, గ్రూప్ 1 పరీక్షలను రీషెడ్యూల్ చేయండని కేంద్రం మంత్రి బండి సంజయ్‌ అన్నారు. 29జీవో వల్ల గ్రూప్ 1 పరీక్షల్లో 5003 మంది ఎస్సీ,ఎస్టీ,బీసీ అభ్యర్థులు అనర్హలయ్యారని, 563 పోస్టులకు గుండుగుత్తగా 1:50 చొప్పున అభ్యర్థులను ప్రకటించడం అన్యాయమన్నారు. ఈ మొత్తం పోస్టుల్లో 354 రిజర్వ్ పోస్టులు.. 29 జీవోవల్ల ఓపెన్ కేటగిరిలో అర్హత సాధించిన రిజర్వ్.. అభ్యర్థులను సైతం రిజర్వ్ కేటగిరీలో చేర్చడం అన్యాయమన్నారు. ఈ జీవోవల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల అభ్యర్థులు 1:50 చొప్పున అర్హత సాధిస్తే…. ఓసీ వర్గాలు 1:65 శాతం మేరకు అర్హత సాధించారని, జీవో నెంబర్ 29 రాజ్యాంగ స్పూర్తికి, రూల్ ఆఫ్ రిజర్వేషన్ కు వ్యతిరేకమన్నారు. గ్రూప్ 1 అభ్యర్థులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారని, గ్రూప్ 1 పరీక్షలను రీషెడ్యూల్ చేయకుంటే ఆత్మహత్యే శరణ్యమని వాపోతున్నారన్నారు బండి సంజయ్‌.. 29 జీవో వల్ల రాష్ట్రంలో మొత్తం రిజర్వేషన్ల వ్యవస్థనే రద్దు చేయబోతున్నారనే చర్చ మొదలైందని, తక్షణమే 29 జీవోను ఉపసంహరించుకోవాలన్నారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డికి బండి సంజయ్‌ లేఖలో :

ఈనెల 21న నిర్వహించబోయే గ్రూప్-1 పరీక్షలపై రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగుల్లో తీవ్రమైన ఆందోళన నెలకొంది. ముఖ్యంగా గ్రూప్-1 పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన కన్పిస్తోంది. దీనికి ప్రధాన కారణం రాజ్యాంగ స్పూర్తికి భిన్నంగా 2024 పిబ్రవరి 8న జీవో నెంబర్ 29 పేరిట జారీ చేసిన నూతన ఉత్తర్వులే. ఈ జీవోవల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు రిజర్వేషన్లలో తీరని అన్యాయం జరుగుతోంది.

గ్రూప్-1 నోటిఫికేషన్ లో పేర్కొన్న వివరాల ప్రకారం మొత్తం 563 పోస్టులను భర్తీ చేయాల్సి ఉండగా, అందులో 354 పోస్టులు ఎస్సీ,ఎస్టీ,బీసీసహా ఇతర రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకు కేటాయించారు. రిజర్వేషన్లు పోగా మిగిలిన 209 పోస్టులకుగాను 1:50 చొప్పున టాప్ 10,450 ర్యాంకులు సాధించిన వారందరినీ ఎంపిక చేయాలి. వీటిలో టాప్ మార్కులు సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు కూడా ఉంటారు. ఈ ర్యాంకులు సాధించిన వారిని మినహాయించి 354 రిజర్వ్ పోస్టులకు 1:50 నిష్పత్తి చొప్పున 17700 మంది రిజర్వ్ అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేయాలి. యూపీఎస్సీసహా అన్ని రాష్ట్రాల్లోనూ నిర్వహించే పబ్లిక్ సర్వీష్ కమిషన్లు దశాబ్దాల నుండి ఇదే విధానాన్నే అనుసరిస్తున్నాయి.

కానీ జీవో 29 అందుకు భిన్నం. మొత్తం 563 పోస్టులుంటే… రిజర్వ్ కేటగిరీలతో పనిలేకుండా 1:50 నిష్పత్తి ప్రకారం మొత్తం టాప్ 28,150 ర్యాంకులు సాధించిన వారందరినీ గుండుగుత్తగా ఎంపిక చేశారు. ఒకవేళ ఆయా పోస్టుల్లో ఎవరైనా రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులు తక్కువ పడితే… 28,150 తరువాత నుండి తీసుకుంటున్నారు. దీనివల్ల ఓపెన్ కేటగిరీ కింద అర్హత సాధించిన ఎస్సీ,ఎస్టీ,బీసీ అభ్యర్థులను రిజర్వేషన్ కేటగిరీలోనే కలిపేశారు. దీనివల్ల 5003 మంది రిజర్వ్ డ్ కేటగిరీ అభ్యర్థులు మెయిన్స్ పరీక్ష రాసే అవకాశం లేకుండా నష్టపోయారు. ఓపెన్ కేటగిరీ అభ్యర్థులను 1:65 నిష్పత్తిలో అర్హులుగా ప్రకటించడమే ఇందుకు కారణం. ఇది రూల్ ఆఫ్ రిజర్వేషన్ కు భిన్నం. రాజ్యాంగ స్పూర్తికి పూర్తికి విరుద్ధం. దీనివల్ల దాదాపు 30 శాతం ఎస్సీ,ఎస్టీ,బీసీ అభ్యర్థులు ఈ 29 జీవో మూలంగా మెయిన్స్ పరీక్షకు అనర్హలుగా మారారు.

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్లను తుంగలో తొక్కేలా కాంగ్రెస్ ప్రభుత్వం 29 జీవోను జారీ చేయడమే ఘోర తప్పిదం. దీన్ని సరిదిద్దుకోవాల్సింది పోయి… న్యాయం అడిగిన నిరుద్యోగులపై పోలీసులు లాఠీఛార్జ్ చేస్తూ తీవ్ర భయాందోళనలకు గురి చేయడం దుర్మార్గపు చర్య. మహిళలని చూడకుండా హాస్టళ్లలొకి చొరబడి బట్టలూడేలా తీవ్రంగా కొట్టడం సహించరాని చర్య. గర్భిణీ అని కూడా చూడకుండా మహిళలపై పోలీసులు దాడులు చేయడం అమానుషం. మహిళలని చూడకుండా పోలీసులతో కొట్టించడం ప్రభుత్వానికి మాయని మచ్చగా మిగిలిపోతుంది.

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ చర్యలవల్ల నిరుద్యోగులు తీవ్రమైన మానసిక వేదనలో ఉన్నారు. నిన్న అశోక్ నగర్ వెళ్లినప్పుడు అనేక మంది అభ్యర్థులు తమ బాధను వెలిబుచ్చారు. ప్రభుత్వం 29 జీవోను ఉపసంహరించుకుని గ్రూప్ 1 పరీక్షలను రీషెడ్యూల్ చేయకపోతే ఆత్మహత్యే శరణ్యమని వాపోయారు. 29 జీవో మూలంగా కాంగ్రెస్ ప్రభుత్వం భవిష్యత్తులో మొత్తం రిజర్వేషన్లనే ఎత్తివేయబోతోందని ఆందోళన కూడా నిరుద్యోగుల్లో వ్యక్తమైంది. మరి కొద్ది గంటల్లో పరీక్ష ప్రారంభమవుతుందని తెలిసినప్పటికీ ఈరోజు కూడా నిరుద్యోగులు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు.

ఇప్పటికైనా పంతాలు, పట్టింపులకు పోకుండా రాజకీయాలను పక్కనపెట్టి మానవతా హ్రుదయంతో ఆలోచించండి. నిరుద్యోగుల కుటుంబాల ఆవేదనను అర్ధం చేసుకోండి. రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధమైన 29 జీవోను ఉపసంహరించుకునేలా ఆదేశాలివ్వండి. రేపు జరగబోయే గ్రూప్ 1 పరీక్షలను వెంటనే రీషెడ్యూల్ చేయండి. రిజర్వేషన్ల కొనసాగింపుపైనా స్పష్టమైన ప్రకటన చేయాలని కోరుతున్నా. ఆందోళన చేస్తున్న నిరుద్యోగులంతా మీ కుటుంబ సభ్యులుగా భావించి సానుకూల నిర్ణయం తీసుకుని న్యాయం చేస్తారని ఆశిస్తున్నా. ముఖ్యంగా గ్రూప్ 1 అభ్యర్థులు పడుతున్న తీవ్రమైన ఆందోళనకు ముగింపు పలకాలని విజ్ఝప్తి చేస్తున్నా.’ అని బండి సంజయ్‌ అన్నారు.