నిజమాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అర్వింద్ ఇంటి ముందు టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఆందోళన చేసేందుకు వచ్చి.. ఆయన నివాసంపై దాడి చేశారు. దీంతో అర్వింద్ ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు టీఆర్‌ఎస్ కార్యకర్తలను చెదరగొట్టారు. భారీగా బందోబస్తు నిర్వహించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అయితే.. ఈ నేపథ్యంలో జిల్లా అధ్యక్షులు, వివిధ మోర్చాల నేతలతో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నివాసంపై టీఆర్ఎస్ గూండాల దాడిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
Also Read : Chintala Ramachandra Reddy : కుటుంబ పాలనకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారా?
టీఆర్ఎస్ నేతలు అరాచకాలు, సీఎం కేసీఆర్ కుటుంబ నియంత పాలనను నిరసిస్తూ ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కార్యకర్తలకు బండి సంజయ్ ఆదేశించారు. అంతేకాకుండా.. 70 ఏళ్ల వృద్దురాలని కూడా చూడకుండా టీఆర్ఎస్ గూండాలు దాడుల పేరిట ధర్మపురి అర్వింద్ మాతృమూర్తిని తీవ్ర భయభ్రాంతులకు గురిచేయడంపట్ల బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ గూండాల అరాచకాలపై ప్రజల్లోకి వెళ్లి ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే బీజేపీ నేతలు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌ను కలిసి ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడి ఘటనపై ఫిర్యాదు చేశారు.
