బీజేపీ అధికారంలోకి వస్తే ముథోల్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుని అన్ని విధాలా అభివ్రుద్ధి చేస్తానని బీజేపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ హామీ ఇచ్చారు. అట్లాగే నాందేడ్ నుంచి బైంసా- నిర్మల్ మీదుగా మంచిర్యాల వరకు రైల్వే లైన్ నిర్మాణానికి తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు. హైదరాబాద్ నుంచి బోధన్- బాసర మీదుగా బైంసా వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారిని మహారాష్ట్రలోని మాహోర్ వరకు పొడిగించాలనే ప్రజల డిమాండ్ ను కేంద్రం ద్రుష్టికి తీసుకెళతానన్నారు. అట్లాగే ముథోల్ టెక్స్ టైల్ పార్క్, పత్తి పంట బాగా పండే ముధోల్ నియోజకవర్గంలో టెక్స్ టైల్ పార్క్, పీజీ కాలేజీ, ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటుకు క్రుషి చేస్తానని హామీ ఇచ్చారు. గోదావరిపై ఎత్తిపోతల పథకాలు నిర్మించి ముథోల్ నియోజకవర్గానికి పూర్తిస్థాయిలో సాగునీరందిస్తామని హామీ ఇచ్చారు. పెండింగ్ లో ఉన్న సుద్ధ(గడ్డెన్న)వాగు ప్రాజెక్టు కాలువల నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. పల్సికర్ రంగారావు ప్రాజెక్టు ముంపు గ్రామాన్ని అన్ని విధాలా ఆదుకుంటానన్నారు. ముథోల్ దత్తత తీసుకుని అన్ని విధాలా అభివ్రుద్ధి చేయడంతోపాటు బైంసాను మైసాగా మారుస్తానని ప్రకటించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ముథోల్ నియోజకవర్గానికి వచ్చిన బండి సంజయ్ కుమార్ బీజేపీ అభ్యర్ధి రామారావు పటేల్ తో కలిసి బైంసాలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. కనీవినీ ఎరగని రీతిలో తరలివచ్చిన జన సందోహం, ఉప్పొంగిన అభిమానుల ఉత్సాహం మధ్య బండి సంజయ్ ప్రసంగించారు..
ఇక్కడికి వచ్చిన జనాన్ని చూస్తే కేసీఆర్ గుండె పగిలిపోవడం ఖాయం…బీజేపీ బంపర్ మెజారిటీతో గెలవడం తథ్యం. మీలో హిందూ రక్తం ప్రవహిస్తే…మీరంతా ఛత్రపతి శివాజీ రూపాలైతే… నవంబర్ 3న ముథోల్ లో విజయోత్సవాలు జరపాల్సిందే.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని దుష్ప్రచారం చేస్తున్నారు. ఆ పార్టీ పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. ఆ పార్టీకి ఇప్పటి వరకు జరిగిన ఏ ఎన్నికల్లోనూ డిపాజిట్లే రాలేదు. ఆ పార్టీ అధికారంలోకి ఎలా వస్తుంది? కాంగ్రెస్ మేనిఫెస్టోను చూసి జనం నవ్వుకుంటున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో చెల్లని రూపాయి. ఆ పార్టీ ఇచ్చే హామీలకు విలువ లేదు. 14 వందల మంది యువకుల బలిదానాలతో తెలంగాణ వస్తే 10 ఏళ్ల పాలనలో ప్రజలకు కేసీఆర్ ఏం చేశారు? అసలు తెలంగాణ ఏర్పాటులో కేసీఆర్ పాత్ర ఏముంది? సుష్మాస్వరాజ్ ఒత్తిడితోనే పార్లమెంట్ లో బిల్లు ఆమోదం పొందింది. అయినా తెలంగాణ ప్రజలు నమ్మి ఓట్లేస్తే ప్రజలను కేసీఆర్ మోసం చేశారు. డిసెంబర్ 4న కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కావడం తథ్యం. తెలంగాణ ప్రజలను అరిగోస పెట్టిన కేసీఆర్ కు తగిన గుణపాఠం చెప్పబోతున్నారు. ముథోల్ ను నేను దత్తత తీసుకుంటా… రామారావు పటేల్ గెలిచాక మళ్లీ వస్తా…బీజేపీ అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం….బైంసాను మైసాగా మారుస్తా…. ఇప్పటి వరకు బైంసాకు నాలుగుసార్లు వచ్చిన. బైంసా లో ఎంఐఎం గూండాలు చేసిన అరాచకాలు నా కళ్లముందు ఇంకా మెదులుతున్నాయి. బాధితులందరికీ న్యాయం చేస్తా… ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఛత్రపతి శివాజీలా కదం తొక్కాలి…
12 శాతం ఓట్ల కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ కక్కుర్తి.. బీఆర్ఎస్ ఓట్ల కోసం ఎంఐఎం ను నమ్ముకుంటే… కాంగ్రెస్ ముస్లిం మతపెద్దలను నమ్ముకుంది. బైంసాలోని నా హిందూ తమ్ముళ్లను ఎంఐఎం గూండాలు ఏ విధంగా హింసించాయో నాకింకా గుర్తుంది. హిందువుల ఇండ్లను తగలబెట్టి నరకం చూపిన సంఘటన మరువలేదు… బీఆర్ఎస్ కు ఓట్లేసి గెలిపిస్తే…. ఈ నియోజకవర్గానికి, ఈ జిల్లాకు ఒరిగిందేమైనా ఉందా? ఒక్క పనికొచ్చే పనైనా చేసిర్రా? వర్షం పడితే నిర్మల్, భైంసా పట్టణాలు ఎందుకు మునిగిపోతున్నాయి. ఒక్క రోజు రెండు రోజులు కాదు. పెద్ద వాన పడితే వారం రోజుల దాకా బయటకు వెళ్లే పరిస్థితి ఉంటలేదు. ఈ జిల్లా మంత్రికి, ఆయన అనుచరులకు ఎక్కడపడితే అక్కడ చెరువులు కబ్జా చేసి ప్రజలను ముంచడం తప్ప ఒరగబెట్టిందేముంది? వాళ్లు చేసిన అక్రమాలతోనే నిర్మల్, భైంసా పట్టణాలు మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం ఒక్కనాడన్నా ఇక్కడున్న ముంపుపై అధ్యయనం చేసిందా..? మంత్రి అనుచరుల ఆగడాలను కట్టడి చేసిందా..? దేవాదాయ మంత్రిగా ఉంటూ దేవుడి మాన్యాలను చెరబడుతూ ఒక వర్గం ఓట్లకోసం ఈద్గాకు భూములను దారాధత్తం చేయాలనుకున్నోడు.. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడితే దాచిపెట్టింది ఎవరు..? ఇంత పేరున్న విద్యా సంస్థను బజార్లో పడేసింది ఎవరు..? నెలల కొద్దీ విద్యార్థులు ఆందోళనలు చేస్తే తప్ప చిన్నదొరకు వినపడనంత చెవిటి ప్రభుత్వమా ఇది.. ట్రిపుల్ ఐటీలో కేటీఆర్ నువు ఇచ్చిన హామీలన్నీ అమలైనయా..? ఒక్కనాడన్నా ఇక్కడి ఎమ్మెల్యే ట్రిపుల్ ఐటీకి వెళ్లిండా..?
బాసర సరస్వతి అమ్మవారి ఆలయ అభివృద్ధికి నయా పైసా ఎందుకు ఇయ్యలేదు. బాసర టెంపుల్ లో అవినీతికి పాల్పడిందెవరు..? చదువుల తల్లి ఆలయాన్ని ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంట లేదు..? ఇక్కడి ప్రజలు.. ఇక్కడి దేవుళ్లంటే అంత చులకనా..? భైంసాలో పత్తి రైతులకు మార్కెట్సదుపాయం కల్పించే ప్రయత్నం ఎందుకు చేయలేదు. పక్క నియోజకవర్గంలో ఉన్న ఇక్కడి మంత్రికి పత్తి రైతుల గోడు పట్టించుకునే తీరికలేదు. నిర్మల్, భైంసా మున్సిపాలిటీల్లో ఉద్యోగాలను మంత్రి సన్నిహితులే అమ్ముకుని.. నిరుద్యోగులు తిరగబడి ఆందోళనలు చేసిన విషయం పాదయాత్ర సందర్భంగా నా ద్రుష్టికి వస్తే… నేను వార్నింగ్ ఇస్తే ఆ నియామకాలను రద్దు చేసింది నిజం కాదా.. ఇంతకీ బాధితుల దగ్గర తీసుకున్న పైసలన్నీ వాపస్ ఇచ్చిండా లేదా? ముస్లిం సమాజానికి అప్పీల్ చేస్తున్నా… ఓట్ల కోసమే మీ వద్దకు వస్తున్నారు..టోపీలు పెట్టుకుని నమాజ్ పేరుతో మిమ్ముల్ని మోసం చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి.. మోడీ ప్రభుత్వం వచ్చాక దేశంలో ఎక్కడా అల్లర్లు జరగలేదు. ఎక్కడ మతకలహాలు జరగలేదు.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మాటలు నమ్మితే మోసపోతారు. హిందూ యువకులందరికీ విజ్ఝప్తి చేస్తున్నా… మీరంతా ఓటు బ్యాంకుగా మారండి…’ అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.