Site icon NTV Telugu

Bandi Sanjay : 8 ఏళ్లుగా పంట నష్టపోయిన రైతులకు ఎందుకు సాయం చేయలేదు?

Bandi Sanjay Ktr

Bandi Sanjay Ktr

గత 8 ఏళ్లుగా అకాల వర్షాలతో దెబ్బతిన్న పంట పొలాలను ఏనాడూ పట్టించుకోని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎన్నికల ఏడాది వచ్చేసరికి పంట పొలాలను సందర్శించి రైతులపట్ల ఎనలేని ప్రేమను ఒలకపోస్తున్నారని విమర్శించారు తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. పంట నష్టపోయిన రైతుకు ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించడం కంటి తుడుపు చర్య. రైతులకు ఇచ్చే సాయం ఏ మూలకు సరిపోదు. పెట్టుబడి ఖర్చులకు కూడా సరిపోవు. అయినప్పటికీ అదే గొప్ప సాయంగా కేసీఆర్ చెప్పడం సిగ్గు చేటని ఆయన మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షలకుపైగా ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. అనేక పత్రికలు, టీవీలతోపాటు రైతు సంఘాల నేతలు సైతం ఇదే విషయం చెబుతున్నారు. దీనిపై వ్యవసాయ, రెవెన్యూ అధికారులు ఎక్కడా క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని నమోదు చేయలేదని, సీఎం మాత్రం 2 లక్షల 28 వేల ఎకరాల్లోనే పంట నష్టం జరిగిందని చెప్పడం విడ్డూరం. ఈ విషయంలో రైతు సంఘాల విజ్ఞప్తులను స్వీకరించే ప్రయత్నం చేయకుండా గృహ నిర్బంధాలకే పరిమితం చేయడం బాధాకరమన్నారు.

Also Read : Samsung Galaxy A54 5G: అదిరే ఫీచర్లతో కొత్త మోడల్స్… స్మార్ట్ ఫోన్ ధర ఎంతంటే

అంతేకాకుండా.. ‘పంట నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటి వరకు కనీసం నివేదిక పంపని కేసీఆర్… కేంద్రాన్ని అడగడమే దండగంటూ బదనాం చేయడం సిగ్గు చేటు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన పథకాన్ని రాష్ట్రంలో అమలు చేస్తే పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందే అవకాశం ఉన్నప్పటికీ, బీజేపీకి పేరొస్తుందనే అక్కసుతో ఏళ్ల తరబడి అమలు చేయకుండా రైతుల నోట్లో మట్టి కొట్టిన కేసీఆర్ తిరిగి కేంద్రంపై విమర్శలు చేయడాన్ని చూసి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు. ప్రతిసారి తన చేతగానితనాన్ని కేంద్రంపై నెట్టి తప్పించుకోవాలనుకుంటున్న కేసీఆర్ తెలంగాణకు ముఖ్యమంత్రి అనే విషయాన్ని మర్చిపోతున్నారు. అయినా అన్నీ కేంద్రం ఇచ్చాక ఇక తెలంగాణకు సీఎంగా ఉండి చేసేదేమిటో కేసీఆర్ ఆలోచించుకోవాలి.ఈ విషయంలో రైతుల పక్షాన పోరాడాల్సిన కమ్యూనిస్టు పార్టీలు అధికార పార్టీ భజన చేయడం విచారకరం.

Also Read : Ugadi Celebrations: దుబాయిలో ఉగాది వేడుకలు

ప్రజా సమస్యలు పట్టకుండా ప్రగతి భవన్, ఫాంహౌజ్ కే పరిమితమైన ముఖ్యమంత్రి కేసీఆర్ అహంకారాన్ని అణిచివేసి ధర్నా చౌక్ కు, రైతుల వద్దకు తీసుకురాగలిగామంటే బీజేపీ చేసిన పోరాటాల ఫలితమే. ఇకనైనా కేసీఆర్ కేంద్రాన్ని విమర్శించడం మానుకుని రాష్ట్ర రైతాంగాన్ని పూర్తిగా ఆదుకోవాలి. తక్షణమే పంట నష్టంపై సమగ్ర నివేదిక తెప్పంచుకోవడంతోపాటు వాస్తవిక నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందించాలని బీజేపీ తెలంగాణ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర రైతాంగ దీర్ఘాకాల ప్రయోజనాలను పెట్టుకుని తక్షణమే సమగ్ర పంట బీమా విధానాన్ని ప్రవేశపెట్టాలని బీజేపీ తెలంగాణ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.’ అని బండి సంజయ్‌ అన్నారు.

Exit mobile version