ఎవరెస్ట్, ఎండీహెచ్ మసాలాలపై విదేశాల్లో నిషేధం కొనసాగుతోంది. అంతేకాకుండా వాటి ఉత్పత్తులను తిరిగి ఇండియాకు పంపేయాలని ప్రభుత్వాలు ఆదేశించాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తం అయింది. నిషేధం వెనుక ఉన్న వివరాలను అందజేయాలని కేంద్ర వాణిజ్య శాఖ సింగపూర్, హాంకాంగ్ ఎంబసీలను కోరింది.
ఇటీవల ఎవరెస్ట్ మసాలాలో పురుగుల మందు అవశేషాలు ఉన్నట్లుగా సింగపూర్ ప్రభుత్వం గుర్తించింది. దీంతో వాటి ఉత్పత్తులను తిరిగి ఇండియాకు పంపేయాలని ఆదేశించింది. అనంతరం ఎండీహెచ్ సాంబార్ మసాలాలో కూడా కేన్సర్ కారకాలు ఉన్నట్లుగా తేలింది. దీంతో ఎండీహెచ్ మసాలాపై హాంకాంగ్ ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో ఈ రెండు ఉత్పత్తులపై భారత ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పటికే వీటి ఉత్పత్తులపై వివరాలు సేకరించింది. తాజాగా ఆ రెండు దేశాల నుంచి కూడా వివరాలు సేకరించే పనిలో పడింది. ఈ రెండింటిలో తేలిన అవశేషాలకు సంబంధించి వివరణాత్మక నివేదికను పంపాలని భారత రాయబార కార్యాలయాలను కేంద్ర వాణిజ్య శాఖ ఆదేశించింది. దీంతో సింగపూర్, హాంకాంగ్ ఆహార భద్రతా నియంత్రణ సంస్థల నుంచి భారత ఎంబసీ వివరాలు సేకరిస్తోంది.
ఇది కూడా చదవండి: Prathinidhi 2: ప్రతినిధి 2 మూవీ రిలీజ్ వాయిదా..
ప్రపంచంలోనే ఎవరెస్ట్, ఎండీహెచ్ మసాలాలకు మంచి ఉత్పత్తులు ఉన్నాయి. ఇండియా నుంచి ఎక్కువగా ఈ మసాలాలు ఎగుమతి అవుతుంటాయి. అయితే ఇటీవల జరిగిన మెడికల్ టెస్టుల్లో మసాలాల్లో పరిమితులకు మించి ‘ఇథిలీన్ ఆక్సైడ్’ అనే క్రిమిసంహారకాలు ఉన్నట్లుగా ప్రభుత్వాలు గుర్తించాయి. దీంతో ఈ రెండు ఉత్పత్తులను ఆయా దేశాలు నిషేధం విధించాయి.
ఇది కూడా చదవండి: Allari Naresh : ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ఆ సినిమా చేసాను..
ఇదిలా ఉంటే ఇప్పటికే ఆయా కంపెనీల నుంచి వివరాలు కోరినట్లు కేంద్ర వాణిజ్య శాఖ అధికారి తెలిపారు. ఈ మసాలాలపై నిషేధం వెనుక ఉన్న మూల కారణాలపై దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లుగా పేర్కొన్నారు. రిపోర్టులు అందగానే ఎగుమతిదారులతో చర్చిస్తామని చెప్పారు. సింగపూర్ మరియు హాంకాంగ్‌లోని రాయబార కార్యాలయాల నుంచి వివరాలు కోరినట్లు అధికారి తెలిపారు. మసాలా రవాణాలో ఇథిలీన్ ఆక్సైడ్‌ను తప్పనిసరిగా పరీక్షించే అంశంపై చర్చించడానికి పరిశ్రమలతో సంప్రదింపులు జరగనున్నాయని మంత్రిత్వ శాఖ అధికారి పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే ఎవరెస్ట్, ఎండీహెచ్ సాంబార్ మసాలాలను కొనుగోలు చేయొద్దని ఇప్పటికే సింగపూర్, హాంకాంగ్ ప్రజలకు ప్రభుత్వాలు విజ్ఞప్తి చేశాయి. అంతేకాకుండా వ్యాపారులు కూడా వాటిని విక్రయించొద్దని కూడా ఆదేశించాయి. ఆ ఉత్పత్తులను ఇండియాకు తిరిగి పంపేయాలని కూడా ఫుడ్ ఏజెన్సీలకు సూచించాయి.
