NTV Telugu Site icon

Balochistan Bomb Blast: పాకిస్థాన్‌లో బాంబు పేలుడు.. 34 మంది మృతి!

Balochistan Bomb Blast

Balochistan Bomb Blast

At least 34 Killed in Balochistan Bomb Blast: పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో బాంబు పేలుడు సంభవించింది. ప్రవక్త ముహమ్మద్ జన్మదిన వేడుకల కోసం జనాలు ర్యాలీగా వెళ్తున్న సమయంలో జరిగిన ఆత్మాహుతి పేలుడులో 34 మంది మృతి చెందారు. ఈ ఘటనలో 100 మందికి పైగా గాయపడ్డారు. మస్తుంగ్ జిల్లాలోని మదీనా మసీదు సమీపంలో ఈ పేలుడు సంభవించిందని జియో న్యూస్ పేర్కొంది. ఈ ర్యాలీలో విధులు నిర్వహిస్తున్న మస్తుంగ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) నవాజ్ గష్కోరి మరణించారు.

ముహమ్మద్ ప్రవక్త జయంతి మిలాద్‌ ఉన్‌ నబీని పురస్కరించుకుని మదీనా మసీదు వద్ద ఈరోజు మధ్యాహ్నం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున స్థానికులు పాల్గొని ప్రార్థనలు చేశారు. ఆ సమయంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 34 మంది మృతిచెందగా.. మరో 130 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రుల్లో కొంతమంది పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

Also Read: Kane Williamson Out: న్యూజిలాండ్‌కు భారీ షాక్‌.. కేన్‌ మామ దూరం!

సూసైడ్‌ బాంబర్ డీఎస్పీ కారు పక్కనే తనను తాను పేల్చుకున్నాడని సిటీ స్టేషన్ హౌస్ ఆఫీసర్ మహ్మద్ జావేద్ లెహ్రీ తెలిపారు. దీన్ని ఆత్మాహుతి దాడిగా ప్రాథమికంగా నిర్ధారించినట్లు పేర్కొన్నారు. ఘటనా స్థలంలో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారిని క్వెట్టాకు తరలించామని, అన్ని ఆసుపత్రుల్లో అత్యవసర పరిస్థితిని విధించామని బలూచిస్థాన్ తాత్కాలిక సమాచార మంత్రి జాన్ అచక్జాయ్ చెప్పారు.