సీఎం పదవి స్థాయి తగ్గించి పోకిరిలా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ఎన్నికల ప్రచార సభల్లో రాజనీతిజ్ఞుడిగా మాట్లాడారన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి చిల్లర మల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని, అబద్దపు పునాదులు, అలవికానీ హామీల మీద ఏర్పాటైంది ప్రభుత్వం కాంగ్రెస్ అని ఆయన విమర్శించారు. రైతుబంధు కోసం గత ప్రభుత్వంలో విడుదల చేసిన రూ. 7,700 కోట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి రాఘవ కన్‌స్ట్రక్షన్‌కి, కాంగ్రెస్ కంట్రాక్టర్లకి జేబుల్లోకి వెళ్లాయన్నారు. బంగారు పళ్లెంలో సుసంపన్నమైన రాష్ట్రన్ని అభివృద్ధి చేసి కాంగ్రెస్ పార్టీకి అప్పగించామని ఆయన తెలిపారు. డిసెంబర్ 9న చేస్తామన్న రుణమాఫీ, 4 వేల రూపాయల పెన్షన్, 5వందల రూపాయల గ్యాస్, మెగా డీఎస్సీ. జాబ్ క్యాలెండర్ ఏ ఒక్క హామీ కూడా కాంగ్రెస్ పార్టీ నెరవేర్చలేదని, గత ఎన్నికల్లో చెన్నూరు అభ్యర్థి వివేక్ ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చాలన్నారు. వివేక్‌ను చెన్నూరు నియోజకవర్గానికి నిధులు తీసుకురమ్మంటే, తన కొడుకు ఎంపీ సీటు కోసం ఢిల్లీ, హైదరాబాద్లో బిజీగా ఉంటున్నాడని, చెన్నూరుకు నిధులు రాకుండా, రాహుల్ జోడో యాత్రకు అడ్డగోలుగా ఖర్చు చేస్తున్నాడన్నారు.
బీఆర్ఎస్ కుటుంబ పాలన అయితే వినోద్, వివేక్ ఎమ్మెల్యేలు అయ్యారు. ఇప్పుడు తన కొడుకు వంశీకి ఎంపీ టిక్కెట్టు కోసం ఆశపడటం కుటుంబ పాలన కాదా..? అని ఆయన ప్రశ్నించారు. ఆటో డ్రైవర్ల ఆర్తనాదాలు, విద్యుత్ కోతలు, రైతుల సాగునీటి సమస్యలు, క్రాప్ హాలిడేలు కాంగ్రెస్ నాయకులకు కనిపించడం లేదా..? అని ఆయన కోరారు. తెలంగాణ ప్రభుత్వం హాయాంలో రైతు కంట కన్నీరు లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటే లేదని, పంట పెట్టుబడి సాయం లేక సకాలంలో ఎరువులు అందక రైతులు అరిగోస పడుతున్నారన్నారు. వీటన్నిటి నుంచి ప్రజల దృష్టి మరలించడానికే కేసీఆర్‌ను తిడుతున్నారని, ప్రశ్నించిన మా కార్యకర్తలపై కేసులు పెడుతూ, దాడులు చేసి బెదిరిస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ గుండాగిరి, దౌర్జన్యాలకు బెదిరేది లేదని, కాంగ్రెస్ ప్రకటించిన 420 మోసపూరిత హామీలు నెరవేర్చకపోతే వారిని ప్రజాక్షేత్రంలో వదిలేది లేదన్నారు. మొన్న ప్రకటించిన కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి సీఎం రేవంత్‌రెడ్డి ఒక్క మాట కూడా మాట్లాడలేదని, మన నీళ్లపై, ప్రాజెక్టులపై నోరు కూడా మెదపలేదన్నారు.
అంతేకాకుండా.. ‘మోడీని చూస్తే రేవంత్‌రెడ్డి వణుకుతున్నాడు. అదానీతో చేసుకున్న రూ. 12 వేల కోట్ల ఒప్పందాలను ప్రజల ముందు పెట్టాలి. సింగరేణి బొగ్గు బావులను అదానీకి అప్పజెప్పేందుకు రేవంత్, వివేక్ ఒప్పందం చేసుకున్నారు. ఎన్నికల సమయంలో నాపై చేసిన ఆరోపణలు ఒక్కటి కూడా రుజువు చేయలేకపోయారు. ఇప్పటికీ చెన్నూరు విడిచి వెళ్లిపోతారని దుష్ప్రచారం చేస్తున్నారు. మళ్లీ ఈ గడ్డపై గులాబీ జెండా ఎగరేవరకు నా ఇల్లే అడ్డా… చెన్నూరే నా గడ్డ. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేస్తం. దేశంలో ఏ దళిత నాయకుడికి లేని ఆస్తులు కేవలం వివేక్ కుటుంబానికే ఎలా వచ్చాయి. దుర్మార్గాలతో అక్రమాలతో సంపాదించినందుకే ఈడీ దాడులు చేసింది. ఈడీ దాడులకు మాకు ఎలాంటి సంబంధం లేదు. గత ప్రభుత్వంలో ఇచ్చిన 65 వేల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆపి దుర్మార్గపు పాలన కొనసాగిస్తున్నారు. పార్టీ ఆదేశాలతో రానున్న రోజుల్లో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ కమిటీలు వేసి బలోపేతం చేస్తాం.’ అని బాల్క సుమన్ అన్నారు.