Balineni Srinivas Reddy: సీఎం జగన్‌పై జరిగిన రాయి దాడిపై మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. ముఖ్యమంత్రి జగన్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. టీడీపీ దిగజారుడు రాజకీయాలకు ఇది నిదర్శనమని.. సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి టీడీపీ వాళ్లు ఓర్చుకోలేకపోతున్నారని ఆయన విమర్శించారు. టీడీపీ సభలు వెలవెలబోతున్నాయన్న ఆయన.. సీఎం సభలకు జనం తండోపతండాలుగా వస్తున్నారన్నారు. టీడీపీ నేతలు తట్టుకోలేక భౌతిక దాడులకు దిగటం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. ఇటీవల ఒంగోలులో కూడా తమ కుటుంబంపై దాడికి ప్రయత్నించారన్నారు. ప్రజాస్వామ్యంలో ఇది సరైన పద్దతి కాదని.. ఇలాంటి ఘటనలకు పాల్పడితే సహించమన్నారు. మూడు పార్టీలు అండగా ఉన్నాయని ఇలా చేయటం సరికాదన్నారు. ప్రతీ ఒక్కరూ ఈ దాడులు ముక్తకంఠంతో ఖండించాలన్నారు. ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
అల్లరి మూకలు ఇలాంటి దాడులకు పాల్పడే అవకాశం లేదని బాలినేని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిపై దాడి చేయాల్సిన అవసరం అల్లరి మూకలకు ఎందుకు ఉంటుందన్నారు. టీడీపీ చేసిన పని ఇది అని.. బాధ్యులను విచారణ చేసి పట్టుకుంటామన్నారు. రెండో సారి ప్రజలు టీడీపీకి బుద్ది చెబుతారన్నారు. ప్రజలు 150 సీట్లతో మరోసారి వైసీపీకి పట్టం కడతారని ఆయన తెలిపారు. టీడీపీ వాళ్ళే దాడులు చేయిస్తారు.. మళ్ళీ వాళ్ళే కుట్రలు అంటారని మండిపడ్డారు. సీఎంగా పని చేసినవారు ఎవరైనా చీప్ పనులు చేస్తారా.. కొద్దిగా ఉంటే రాయి కంటికి తగిలితే పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. టీడీపీ వాళ్లకు మైండ్ పాడైందని… పెన్షన్లు, వాలంటీర్లపై కూడా రోజుకో రకంగా మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబు ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నారని.. ఆయనకు వయసైపోయింది.. తన కొడుకు పరిస్థితి ఏంటా అని ఆయనకు ఆలోచనలు ఎక్కువయ్యాయన్నారు. ఫ్రస్టేషన్‌లో వరస్ట్ రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు.