Balapur Ganesh Laddu: వినాయక చవితి.. ప్రపంచంలో హిందువులు ఏ ఖండంలో ఉన్నా చేసుకునే పెద్ద పండుగ. మన దేశంలో ప్రజలు సామూహికంగా మండపాలను ఏర్పాటు చేసి అత్యంత భక్తిభావంతో జరుపుకునే పండుగ వినాయక చవితి. ప్రత్యేక రూపాల్లో చేసిన గణపతులు ఒక ఎత్తు అయితే.. లడ్డు వేలం పాట మరొక ఎత్తు. మరీ ముఖ్యంగా హైదరాబాద్‌లో అయితే ఈ శోభ పతాకస్థాయిలో ఉంటుంది. ఈ పండుగను మిగతా ప్రాంతాల్లో పోలిస్తే హైదరాబాద్‌లో ఘనంగా జరుపుకుంటారు. హైదరాబాద్‌లో ప్రతి గల్లీలో గణేషుడు కొలువు దీరుతాడు. ఇదిలా ఉండగా.. 11 రోజులు గణేష్ ఉత్సవాలు ముగిసేసరికి ప్రపంచం కళ్లన్నీ ఒక మండపంపై ఉంటాయి. అదే బాలాపూర్ గణేష్ మండపం. ఈ ఏడాది కూడా బాలాపూర్ గణేష్ అందమైన రూపంలో కొలువుదీరుతున్నాడు. స్వామివారు చతుర్భుజాలతో భక్తులను ఆశీర్వదిస్తున్నట్లు కొలువుదీరారు. కుడిచేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో గొడ్డలి పట్టుకుని స్వామి వారు ఉంటారు. అదే విధంగా మరో కుడిచేయి స్వామివారు భక్తులను అనుగ్రహిస్తున్నట్లు, ఎడమ చేతిలో లడ్డూ ఉంటుంది.
బాలాపూర్‌లో లడ్డూ వేలం పాట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ లడ్డూ ప్రసాదం స్వీకరిస్తే ఎంతో పుణ్యఫలం అని భక్తులు నమ్ముతారు. ప్రతి ఏటా పెరిగిపోతున్న లడ్డూ వేలం పాట ధర ఈ ఏడాది రికార్డు ధర పలకడం ఖాయమని తెలుస్తోంది. 1994లో బాలాపూర్ లడ్డూ వేలం పాట ప్రారంభమైంది. అప్పట్లో కొలను మోహన్ రెడ్డి రూ.450కి లడ్డూను కైవసం చేసుకున్నారు. ఆ లడ్డూను తమ కుటుంబసభ్యులకు పంచడంతో పాటు పొలాల్లో చల్లుకోగా ఆయనకు బాగా కలిసి వచ్చినట్లు తెలిసింది. మరో ఏడాది మళ్లీ ఆయనే రూ.4500కు లడ్డూను దక్కించుకున్నారు. లడ్డూను స్వీకరించిన కొలను మోహన్‌రెడ్డికి అంతా బాగా కలిసి వచ్చిందని ప్రచారం జరిగింది. బాలాపూర్ గణేష్ మహిమ కేవలం హైదరాబాదే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. ఆ రోజు నుంచి క్రమంగా లడ్డూ ధర పెరుగుతూనే వచ్చింది. ఒక్కో ఏడాది అయితే ముందు ఏడాదితో పోలిస్తే 10 రెట్లు పెరిగిపోయింది. గతేడాది 2023లో రూ.27 లక్షలకు లడ్డూ ధర పలకగా.. దయానంద్ రెడ్డి అనే భక్తుడు లడ్డూను దక్కించుకున్నారు. తొలి 17 సంవత్సరాలు బాలాపూర్ గ్రామస్థులకు మాత్రమే లడ్డూ వేలం పాటలో పాల్గొనే అవకాశం ఉండేది. తర్వాత కాలంలో స్థానికేతరులకు కూడా లడ్డూ వేలంపాటలో పాల్గొనే అవకాశం కల్పించారు. లడ్డూ వేలం పాటలో పాల్గొనాలంటే మొదటి రోజు నుంచి నిమజ్జనం రోజు ఉదయం వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. కాగా.. ఈ ఏడాది లడ్డూ వేలం పాట రూ.30 లక్షలు దాటొచ్చని అంచనా.
ఈ ఏడాది బాలాపూర్ లడ్డూ వేలం పాట కొత్త రూల్స్ పెట్టారు. గతంలో బయటి వ్యక్తులు మాత్రమే లడ్డూ వేలంలో పాల్గొనేందుకు డబ్బులను ముందుగా డిపాజిట్ చేసేవారు. అయితే ఈ సారి బాలాపూర్ గ్రామ ప్రజలతోపాటు లడ్డూ వేలంలో పాల్గొనే వారంతా ముందస్తు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అలా డిపాజిట్ చేసి పేరు నమోదు చేసుకున్నాకే.. వేలంలో పాల్గొనాలని చెబుతున్నారు. బాలాపూర్ గణేషుని లడ్డూకు…ఈ సారి రూ.27 లక్షలు ముందుగానే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. వేలానికి ముందు రోజే రూ.27 లక్షలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.