Baby Boy Sale: ఈ ఆధునిక యుగంలో ఇంకా శిశువులను అంగడి సరుకుల మాదిరిగా విక్రయిస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. శిశు విక్రయాల గతంలో అనేక ప్రాంతాల్లో వెలుగు చూశాయి. నవ మాసాలు మోసి కన్నబిడ్డలను తమ అవసరాల కోసం అమ్మేస్తున్న ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఓ పసి బిడ్డ విక్రయం ఘటన బాపట్లలలో చోటుచేసుకుంది. నవమాసాలు మోసి జన్మనిచ్చిన ఆ మాతృమూర్తిగా కడుపుతీపి గుర్తుకు రాలేదేమో.. మూడు నెలల పిల్లవాడిని లక్ష రూపాయలకు అమ్మేసింది.
Read Also: Amaravati Railway Line: అమరావతి రైల్వేలైన్‌కు కేంద్ర కేబినెట్ గ్రీన్‌సిగ్నల్
బాపట్ల పట్టణంలోని 11వ వార్డు ఇందిరానగర్ కాలనీలో మూడు నెలల పిల్లవాడిని లక్ష రూపాయలకు తల్లి అమ్మేసింది. సమాచారం అందుకున్న ఐసీడీఎస్ అధికారులు పిల్లవాడిని స్వాధీనం చేసుకొని తల్లిపై ,కొన్న వారిపై బాపట్ల టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మూడు నెలల బాలుడిని పోలీసులు సీడీపీఓకు అప్పగించారు. పసికందును విక్రయించిన తల్లి వెంకటేశ్వరమ్మ, పసికందును కొన్న చీమకుర్తికి చెందిన అల్లురమ్మలపై పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు బాపట్ల పట్టణ సీఐ అహ్మద్ జానీ తెలిపారు. ఈ సందర్భంగా బాపట్ల పట్టణ సీఐ అహ్మద్ జానీ మీడియాతో మాట్లాడుతూ…పసికందును విక్రయించడం చట్టరీత్యా నేరమని, తమ దృష్టికి వచ్చిన వెంటనే విచారించి కేసు నమోదు చేశామని తెలిపారు.