NTV Telugu Site icon

Pakistan Semi Final: పాకిస్తాన్ సెమీ ఫైనల్‌లో ఆడుతుంది.. ప్రణాళికలు సిద్ధం చేసిన బాబర్ ఆజామ్‌!

Babar Azam Press Conference

Babar Azam Press Conference

Babar Azam React on Pakistan Semi Final Chances: శ్రీలంక, న్యూజిలాండ్‌ మ్యాచ్‌ ముందు వరకూ పాకిస్థాన్‌కు ప్రపంచకప్‌ 2023 సెమీస్‌ అవకాశాలు మెండుగానే ఉన్నాయి. లంకపై ఘన విజయంతో నెట్‌ రన్‌రేట్‌ను పెంచేసుకున్న కివీస్‌.. నాలుగో జట్టుగా సెమీస్‌లో ఆడటం దాదాపుగా ఖాయమే అయింది. న్యూజిలాండ్‌ గెలుపుతో పాక్‌ ఆశలు దాదాపుగా గల్లంతయ్యాయి. ఇప్పుడు పాక్ ముందంజ వేయాలంటే.. ఇంగ్లండ్‌పై కనివిని ఎరుగని విజయాన్ని అందుకోవాలి. మొదట బ్యాటింగ్‌ చేస్తే 287 పరుగులు, ఛేదనలో అయితే 284 బంతుల తేడాతో పాకిస్తాన్ గెలవాల్సి ఉంది. అది అసాధ్యం అయినా.. పాకిస్తాన్ సెమీ ఫైనల్‌లో ఆడుతుందని ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజామ్‌ ధీమా వ్యక్తం చేశాడు.

ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో బాబర్‌ ఆజామ్‌ మాట్లాడుతూ… ‘ప్రపంచకప్‌ 2023 సెమీస్‌ అవకాశాలు మాకు ఇంకా ఉన్నాయి. సెమీస్ ఆడాలని మా మనస్సులో ఉంది. మేము మా ప్రణాళికలను అమలు చేయడానికి ప్రయత్నిస్తాం. లక్ష్యాన్ని ఎలా సాధించగలం అని ఓ స్పష్టతతో ఉన్నాం. గుడ్డిగా మ్యాచ్ ఆరంభించకుండా సరైన ప్రణాళికతో ముందుకు వెళతాం. మొదటి 10 ఓవర్లు ఎలా ఎలా ఆడాలి, తరువాత 20 ఓవర్లు, లక్ష్యాన్ని ఎలా సాధించాలి?, మంచి భాగస్వామ్యం, ఏ ఆటగాడు పిచ్‌లో ఎంతసేపు ఉండాలి అని చాలా విషయాలు ఉన్నాయి’ అని అన్నాడు.

Also Read: Babar Azam Captaincy: నా కెప్టెన్సీ ఉంటుందో పోతుందో: బాబర్‌ ఆజామ్‌

‘ఫఖర్ జమాన్ 20 లేదా 30 ఓవర్ల పాటు క్రీజులో ఉంటే మేం మా లక్ష్యాన్ని సాధించగలం. రిజ్వాన్, ఇఫ్తికార్‌లు దాన్ని కొనసాగిస్తే సునాయాసంగా విజయం సాధ్యం అవుతుంది. అదంతా సాధ్యం అవుతుందా? అని బయటవాళ్ళు అనుకుంటున్నారు. ఏ పనిలో అయినా ఆశ ఉండాలి. ఏ దశలోనైనా, మీరు చేసే ఏ పనిలోనైనా సానుకూలమైన ఆశ ఉండాలి. నేను దానిని గట్టిగా నమ్ముతాను. అందుకే పాకిస్తాన్ సెమీ ఫైనల్‌లో ఆడుతుంది అని ఆశపడుతున్నా’ అని బాబర్‌ ఆజామ్‌ చెప్పాడు.