Babar Azam: బాబర్ ఆజమ్ వరల్డ్ రికార్డు.. విరాట్ కోహ్లీ రికార్డ్ సేఫ్..

Virat Kohli Babar Azam

Virat Kohli Babar Azam

బాబర్ ఆజమ్ అంతర్జాతీయ క్రికెట్‌లో మరో మైలురాయిని అందుకున్నాడు. శ్రీలంక, ఇంగ్లండ్‌లతో పాకిస్థాన్‌లో జరుగుతున్న వన్డే ట్రై సిరీస్‌లో భాగంగా ఆదివారం రావల్పిండి వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో బాబర్ ఈ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో కలిపి 16,000 పరుగులు పూర్తి చేసిన ఐదో పాకిస్థాన్ క్రికెటర్‌గా బాబర్ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగేందుకు బాబర్‌కు కేవలం 7 పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. మ్యాచ్ ప్రారంభమైన త్వరలోనే ఆ టార్గెట్ పూర్తి చేసి ఈ మైలురాయిని చేరుకున్నాడు.

ఈ ఘనత సాధించేందుకు బాబర్ ఆజమ్ కేవలం 399 ఇన్నింగ్స్‌లను మాత్రమే తీసుకున్నాడు. పాకిస్థాన్ తరఫున అత్యంత వేగంగా 16 వేల పరుగులు పూర్తి చేసిన మూడో బ్యాటర్‌గా నిలిచాడు. పాక్ తరఫున మహ్మద్ యూసఫ్ (388 ఇన్నింగ్స్), జావేద్ మియాందాద్ (398 ఇన్నింగ్స్) మాత్రమే బాబర్ కంటే ముందున్నారు. పాకిస్థాన్ తరఫున ఇంతకుముందు జావేద్ మియాందాద్, మహ్మద్ యూసఫ్, ఇన్మామౌల్ హక్, యూనిస్ ఖాన్ మాత్రమే ఈ మార్కును అందుకున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో బాబర్ ఆజమ్ ఐదో ఆటగాడిగా చేరాడు.

శ్రీలంకతో జరిగిన ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో, మూడో ఓవర్లో ఓపెనర్ సాయిమ్ అయూబ్ వెనుదిరిగిన తర్వాత బాబర్ మూడో స్థానంలో క్రీజులోకి వచ్చాడు. ఫెర్నాండో బౌలింగ్‌లో అద్భుతమైన డ్రైవ్‌తో ఖాతా తెరిచిన బాబర్, మరో చక్కటి షాట్‌తో 16 వేల పరుగుల మైలురాయిని దాటేశాడు. ఈ మ్యాచ్‌లో నిలకడగా ఆడిన 32 ఏళ్ల బాబర్ ఆజమ్ 57 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 45 పరుగులు చేసి ఈషాన్ మలింగ బౌలింగ్‌లో అవుటయ్యాడు.

ప్రస్తుతం పాకిస్థాన్ వేదికగా శ్రీలంక, ఇంగ్లండ్ జట్లతో జరుగుతున్న ఈ వన్డే ట్రై సిరీస్‌ డబుల్ రౌండ్ రాబిన్ పద్ధతిలో సాగుతోంది. అక్టోబర్ 31న లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో ఈ సిరీస్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 16,000 పరుగులు సాధించిన ప్రపంచ రికార్డు మాత్రం టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (350 ఇన్నింగ్స్) పేరిటే కొనసాగుతోంది.