UP: లవర్‌ కోసం ముస్లింగా మారిన యువకుడు.. మళ్లీ హిందువు మతంలోకి వచ్చేశాడు!

Ayush Malik

Ayush Malik

UP: ఉత్తరప్రదేశ్ శామ్లీ జిల్లాలో సంచలనం సృష్టించిన ఆయుష్ మాలిక్ మత మార్పిడి వ్యవహారం మరో మలుపు తిరిగింది. యూపీ యాంటీ-కన్వర్షన్ చట్టం కింద పోలీసుల విచారణకు దారితీసిన ఈ కేసులో.. ఆయుష్ మాలిక్ తిరిగి హిందూ మతాన్ని స్వీకరించాడు. తన తల్లిదండ్రుల పడుతున్న బాధను చూసి, తన సొంత ఇష్టపూర్వకంగానే మళ్లీ సనాతన ధర్మానికి తిరిగి వచ్చినట్లు ఆయుష్ ప్రకటించాడు. హిందూ మతంలోకి తిరిగి వచ్చిన తర్వాత ఆయుష్ సాంప్రదాయబద్ధంగా పూజలు, ఆచారాలు నిర్వహిస్తున్న ఓ వీడియో ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో ఆయుష్ మాట్లాడుతూ.. “నేను గతంలో ఇస్లాం మతంలోకి మారి నా మతాన్ని మార్చుకున్నాను. కానీ నా తల్లిదండ్రుల బాధను చూసి, నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని, నా స్వచ్ఛంద నిర్ణయంతోనే మళ్లీ హిందూ మతంలోకి తిరిగి వచ్చాను. ఇకపై నా కుటుంబ రక్షణలోనే, వారితో పాటే జీవించాలనుకుంటున్నాను” అని స్పష్టం చేశాడు. ఆయుష్ తండ్రి దేవరాజ్ మాలిక్ కూడా తన కుమారుడు అధికారికంగా తిరిగి సనాతన ధర్మాన్ని స్వీకరించినట్లు ధృవీకరించారు.

అసలు ఏం జరిగింది?

బీ-ఫార్మా పూర్తి చేసి, తన కుటుంబానికి చెందిన మెడికల్ స్టోర్‌ను చూసుకునే ఆయుష్ మాలిక్‌కు 2018లో కాలి గాయానికి చికిత్స తీసుకుంటున్న సమయంలో చాందిని ఖురేషి అనే ఫిజియోథెరపిస్ట్‌తో పరిచయమైంది. పోలీసుల కథనం ప్రకారం.. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో చాందిని, ఆమె తండ్రి ఇస్లాం ఖురేషి కలిసి ఆయుష్‌ను క్రమంగా ఇస్లాం వైపు ఆకర్షించేలా మైండ్ వాష్ చేశారు. ఆ తర్వాత 2023లో ఆయుష్‌ను ఢిల్లీకి తీసుకెళ్లి, అక్కడ ముస్లిం మతంలోకి మార్చి ‘మొహమ్మద్ అలీ’గా పేరు మార్చారు. అక్కడ నికా (పెళ్లి) కూడా జరిపించినట్లు ఆరోపణలు ఉన్నప్పటికీ, దానికి సంబంధించిన ఎలాంటి వివాహ ధృవీకరణ పత్రాలు పోలీసుల విచారణలో లభించలేదు. మత మార్పిడి తర్వాత ఆయుష్ గడ్డం పెంచడం, రోజుకు ఐదుసార్లు నమాజ్ చేయడం, ముస్లిం సాంప్రదాయ దుస్తులు ధరించడం వంటివి చేయడం ప్రారంభించాడు.

అయితే, తమ కుటుంబానికి ఉన్న కోట్ల రూపాయల విలువైన ఆస్తులను హస్తగతం చేసుకోవాలనే పక్కా ప్లాన్, కుట్రతోనే చాందిని కుటుంబం తన కొడుకును బ్రెయిన్ వాష్ చేసి మతం మార్చిందని ఆయుష్ తండ్రి దేవరాజ్ మాలిక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు ఆధారంగా యూపీ పోలీసులు భారతీయ న్యాయ సంహిత’ (BNS), ఉత్తరప్రదేశ్ చట్టవిరుద్ధ మత మార్పిడి నిషేధ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో కొన్ని వారాల క్రితమే ఫిజియోథెరపిస్ట్ చాందిని ఖురేషిని, ఆమె తండ్రి ఇస్లాం ఖురేషిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయుష్ మళ్లీ తన స్వగృహానికి చేరి హిందూ మతంలోకి మారడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.