అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కరీంనగర్ తెలంగాణ చౌరస్తా కాషాయమయంగా మారింది. తెలంగాణ చౌక్ లో సంబురాలు అంబురాన్నంటాయి. ఈ సందర్భంగా భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారు. అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్ట మహోత్సవ నేపథ్యంలో టపాసులు పేల్చి సంబురాలు చేసుకుంటున్నారు వివిధ హిందూ సంఘాలు, బీజేపీ కార్యకర్తలు. తెలంగాణ చౌక్ వద్ద ఆనందోత్సవాల మధ్య హిందూ సంఘాల కార్యకర్తలతో కలిసి స్వయంగా బండి సంజయ్ టపాసులు కాల్చారు. జై శ్రీరాం…రామలక్ష్మణ జానకీ… జై భోలో హనుమాన్ నినాదాలతో కరీంనగర్ మార్మోగింది.
ఇదిలా ఉంటే.. అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రముఖ నటుడు చిరంజీవి పాల్గొనడంపై హర్షం వ్యక్తం చేశారు. భావోద్వేగానికి లోనైనట్లు తెలిపారు. తన ఇష్ట దైవం హనుమంతుడే ఈ ఆహ్వానం పంపినట్లు భావిస్తున్నానని వ్యాఖ్యానించారు. ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశం లభించడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఇది చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఘటన అని, ఈ క్షణాలను జీవితాంతం గుర్తుంచుకుంటానని వ్యాఖ్యానించారు. ఇదంతా దేవుడి దీవెన అని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అయోధ్య వెళ్లారు. 500 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఈ కల సాకారమవుతోందని పవన్ వ్యాఖ్యానించారు.