NTV Telugu Site icon

Ayodhya Ram Mandir: అయోధ్యలో రామయ్య ఊరేగింపు రద్దు.. కారణం ఏంటంటే?

Ayodhya Ram Mandir

Ayodhya Ram Mandir

శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవంకు మరి కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12.29 గంటలకు శుభ ముహూర్తంలో రాముడి విగ్రహ ప్రతిష్ఠాపణ కార్యక్రమం జరగనుంది. శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపణకు వారం రోజుల ముందే.. ఆచార వ్యవహారాలు ప్రారంభం కానున్నాయి. జనవరి 16 నుంచి 22 వరకు మహామస్తకా అభిషేక కార్యక్రమాలు కొనసాగుతాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఇప్పటికే విడుదల చేసింది. అయితే ఈ షెడ్యూల్‌లో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి.

జనవరి 17న నిర్వహించ తలపెట్టిన బాలరాముడి రూపంలో ఉన్న రామయ్య విగ్రహ ఊరేగింపును రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు రద్దు చేసింది. భక్తుల రద్దీ అధికంగా ఉంటుందనే ఆందోళన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయిదు అదే రోజున రామజన్మభూమి ప్రాంగణంలో కొత్త విగ్రహాన్ని ప్రదర్శిస్తామని తెలిపింది. ఇక జనవరి 15 నుంచి 22 వరకు అయోధ్యలో జరిగే కార్యక్రమ వివరాలను తెలుసుకుందాం.

Also Read: Sunil Gavaskar: ఈ తేడాలు ఎందుకు.. సునీల్‌ గవాస్కర్ ఫైర్!

జనవరి 15 : మకర సంక్రాంతితో అశుభ కాలం ముగియడంతో రాముడి విగ్రహాన్ని యాగశాల మండపంలోకి తీసుకొస్తారు.
జనవరి 16 : శ్రీరాముని విగ్రహానికి ప్రతిష్ఠాపన ఆచారాలు ప్రారంభం (ప్రతిష్ఠా కార్యక్రమంలో పాల్గొనే బ్రాహ్మణులు దీక్ష స్వీకరణ).
జనవరి 17: రామజన్మభూమి ప్రాంగణంలో కొత్త విగ్రహం.
జనవరి 18: మండప ప్రవేశ పూజ, వాస్తు పూజ, వరుణ పూజ, గణేశ పూజ వంటి ఆచారాలతో సహా ప్రాణశక్తి పవిత్రోత్సవానికి శ్రీకారం.
జనవరి 19: రామమందిరంలో యజ్ఞ అగ్నిగుండం స్థాపన. (కర్రతో కర్రను మధిస్తూ అగ్నిని రాజేస్తారు. ఇలా వచ్చిన అగ్నితో యఙ్ఞాన్ని ప్రారంభిస్తారు).
జనవరి 20: వివిధ నదుల నుంచి సేకరించిన నీటిని కలిగి ఉన్న 81 కలశాలతో పుణ్యహవచనం కార్యక్రమం ద్వారా రామమందిరం గర్భగుడిని వేద మంత్రాలతో పవిత్రం చేస్తారు.
జనవరి 21: జలాధివాసం (యజ్ఞం చేసిన అనంతరం ప్రత్యేక పూజలు మధ్య రాముడు విగ్రహాన్ని125 కలశాలతో అభిషేకం చేస్తారు)
జనవరి 22: రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. మధ్యాహ్నం 12గంటల 29 నిమిషాల 08 సెకనుల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకన్లు (84సెకన్ల) కాలంలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు.
జనవరి 24: భక్తులను రామయ్య దర్శనానికి అనుమతిస్తారు.