అయోధ్య రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు సంబంధించిన మతాచారాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. నేడు ప్రయాశ్చిత్త, కర్మకుటి పూజలు జరగనుండగా.. రేపు ఆలయ ప్రాంగణంలోకి విగ్రహం ప్రవేశించనుంది. అలాగే, ఈ నెల 18న రాముడి విగ్రహాన్ని గుర్భగుడిలోకి చేర్చనున్నారు. ఆ రోజు తీర్థపూజ, జలయాత్ర, గంధాదివాస్ పూజలు చేయనున్నారు. అలాగే, 19వ తేదీన ఔషధదివాస్, కేసరిదివాస్, గ్రితదివాస్, ధాన్యదివాస్ పేరుతో పూజలు జరుగనున్నాయి. ఇక, 20వ తేదీన షర్కారదివాస్, ఫలదివాస్, పుష్కదివాస్.. 21న మధ్యదివాస్, శయ్యదివాస్ కార్యక్రమాలు జరుగుతాయి. ఇక, 22వ తేదీ మధ్యాహ్నం 12:20 గంటలకు రాంలాలా విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరుగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు వెల్లడించింది.
Read Also: Supreme Court: స్కిల్ డెవలప్‌మెంట్ కేసు.. నేడు చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు..
రామమందిరంలో విగ్రహ ప్రాణ ప్రతిష్టకు సంబంధించిన మతాచారాలు ఇవాళ్టి నుంచే ఆరంభం కాబోతున్నాయని రామజన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ పేర్కొన్నారు. ఈ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమ మధ్యాహ్నం ఒంటి గంట వరకు పూర్తయ్యే ఛాన్స్ ఉందని తెలిపారు. రాముడి విగ్రహం బరువు 150 నుంచి 200 కిలోల వరకు ఉంటుందని పేర్కొన్నారు. 121 మంది ఆచార్యులు ఈ మతపరమైన క్రతువును నిర్వహించనున్నారు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ గవర్నర్ ఆనందీ బెన్ పటేల్, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం యోగి ఆదిత్యనాథ్ తో పాటు ఇతర ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ నెల 23 నుంచి సాధారణ భక్తులు దర్శించుకునేందుకు ఛాన్స్ కల్పిస్తామని చెప్పారు. దేశంలోని 130 కోట్ల మంది అయోధ్యకు రావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరికి శ్రీరాముడి దర్శనం కల్పించి.. రాత్రి తిరిగి వెళ్లిపోయేలా ప్రణాళికలు ఏర్పాటు చేస్తున్నామని చంపత్ రాయ్ వెల్లడించారు.